మాదకద్రవ్యాలకు బానిసలై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం యువత జీవితాలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థ, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు.
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొంటూ యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు కష్టపడాలని కోరారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, సృజనాత్మక రంగాలపై దృష్టి సారించాలని చెప్పారు. డ్రగ్స్ వినియోగం ఒక వ్యక్తి జీవితానికే పరిమితం కాకుండా అతడి కుటుంబాన్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరమని చిరంజీవి పేర్కొంటూ డ్రగ్స్ నిర్మూలన కేవలం ప్రభుత్వాలు, పోలీసు శాఖల బాధ్యత మాత్రమే కాదని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారి నుంచి కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించగలమని చెప్పారు. ఒకసారి మత్తు పదార్థాలు అలవాటు చేసుకుంటే అది మరో అలవాటుకు దారి తీసే అవకాశం ఉం దని హెచ్చరించారు. యువత తాము ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరి హీరోలుగా గుర్తింపు పొందాలని సూచించారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో చేపట్టిన పాదయాత్రకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిచింది. శుక్రవారం ఉదయం టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున పాల్గొని ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఆయన ప్రజలు, యువతతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు.
అంబర్‌పేట్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్ర ముగింపు రోజున అమీర్‌పేట వద్ద నాగార్జున జత కలిశారు. ఆయనతో పాటు ప్రముఖ నటుడు సాయికుమార్, దర్శకుడు బోయపాటి శ్రీను, హాస్యనటుడు శివారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఈ పాదయాత్ర జరగడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
“వ్యక్తిగతంగా నేను డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా, నా కుటుంబాన్ని, స్నేహితులను, చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాను” అని నాగార్జున ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మరోవైపు నటుడు సాయికుమార్ తనదైన శైలిలో ‘నషా ముక్త్ భారత్ – మేం చేసి తీరుతాం’ అంటూ నినాదాలతో హోరెత్తించి యువతలో స్ఫూర్తి నింపారు.
దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చడం సాధ్యమేననే నమ్మకం ఈ యాత్రతో ఏర్పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలనే నినాదంతో సాగుతున్న ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. యువత, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి కిషన్ రెడ్డి గారితో కలిసి కదం తొక్కారు.
పండిట్ రవిశంకర్, సినీ నటుడు వెంకటేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, బిజెపి ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

More Stories
కొలీజియం సిఫార్సులు ఓ నిర్దిష్టవర్గంకే అనుకూలం
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు భారీగా గ్లోబల్ బ్రాండ్ల ఆర్డర్లు
2.4 కోట్ల ఉద్యోగాలకు ఏఐ ముప్పు