బంగ్లాదేశ్‌లో ఒక వైపు రాజకీయ అనిశ్చితి, మరోవైపు కార్మికుల ఆందోళనలు, అలాగే ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో అక్కడి వస్ర్త పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ రిటైల్ సంస్థలు తమ ఆర్డర్లను ఇతర ఆసియా దేశాలకు మళ్లిస్తున్నాయి. జారా, హెచ్ అండ్ ఎం, మార్క్స్ అండ్ స్పెన్సర్, సెలియో వంటి అంతర్జాతీయ బ్రాండ్లు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు భారీగా ఆర్డర్లను తరలిస్తున్నట్లు వెల్లడించారు.
నవంబర్ 1 నుంచి 18వ తేదీ మధ్య సుమారు 254 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,270 కోట్ల) విలువైన ఆర్డర్లను అంతర్జాతీయ బ్రాండ్లు బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాలకు మళ్లించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందులో అత్యధిక ఆర్డర్లు పొరుగున ఉన్న భారత్‌కు వచ్చినట్లు పేర్కొన్నాయి. నవంబర్ మొదటి అర్ధభాగంలో బంగ్లాదేశ్‌కు వచ్చే నెలవారీ ఆర్డర్లలో దాదాపు పదో వంతు ఇతర దేశాలకు తరలిపోయాయి.
బంగ్లాదేశ్‌లో వస్త్ర కార్మికుల ఆందోళనల కారణంగా 400 మిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.3,570 కోట్ల) ఉత్పత్తి నష్టం జరిగినట్లు బంగ్లాదేశ్ గార్మెంట్స్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్త కర్ఫ్యూలు, మొబైల్ ఇంటర్నెట్పై ఆంక్షల నడుమ బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాకాండలో కనీసం 300 మంది మరణించినట్లు సమాచారం. ఆ దేశ ఎగుమతి ఆదాయంలో 80 శాతానికి పైగా, తయారీ రంగ ఉద్యోగాల్లో దాదాపు 40 శాతం వస్త్ర పరిశ్రమ నుంచే వస్తున్నాయి. దీంతో ఈ పరిణామం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది.
బంగ్లాదేశ్ నుంచి తరలివస్తున్న ఆర్డర్లతో భారత్ ప్రధానంగా లబ్ధి పొందుతోంది. వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా దేశాల వైపు కూడా అంతర్జాతీయ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. సరఫరా వ్యవస్థలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవడంతో పాటు నిర్ణీత సమయంలో ఉత్పత్తులను అందించేందుకు ఈ దేశాలను ప్రత్యామ్నాయ కేంద్రాలుగా ఎంచుకుంటున్నారు.
అయితే, “మన స్నేహపూర్వక పొరుగు దేశంలో నెలకొన్న ఈ దురదృష్టకర పరిస్థితిని వాడుకోవాలనే ఉద్దేశం గానీ, మొగ్గు గానీ భారతదేశానికి లేదు. భారత వస్త్ర పరిశ్రమ తన సొంత యోగ్యత ఆధారంగా రెడీమేడ్ గార్మెంట్ ఎగుమతులను పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, స్వల్పకాలంలో వస్త్రాల ఆర్డర్లు భారతదేశానికి తరలిపోయే అవకాశం ఉంది. ఈ తీవ్ర అంతరాయం వల్ల ఏర్పడిన ఖాళీని పూరించమని భారత వస్త్ర పరిశ్రమను కోరవచ్చు,” అని అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం వస్త్ర కార్మికుల కనీస వేతనాలను 36 శాతం పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్యల్ప పెంపుగా పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వేతనాలను రెట్టింపునకు పైగా పెంచాలని కార్మికులు డిమాండ్ చేయగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనలు కొనసాగించారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య మళ్లీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
వేతనాల పెంపుతో భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్‌లో ఉన్న తక్కువ కార్మిక వ్యయ ప్రయోజనం తగ్గుతుందని పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కొరత, ముడిసరుకుల ధరలు, ఇతర నిర్వహణ ఖర్చులు తయారీదారులపై భారంగా మారాయి. ఉత్పత్తి వ్యయంతో పాటు సరుకుల డెలివరీ సమయం కూడా అంతర్జాతీయ బ్రాండ్లకు కీలకంగా మారింది.
భారత్‌లో బంగ్లాదేశ్‌తో పోలిస్తే దాదాపు వారం రోజుల ముందుగానే సరుకులను అందించే అవకాశం ఉందని పరిశ్రమ ప్రతినిధి ఎం. మొహియుద్దీన్ చౌదరి తెలిపారు. వియత్నాం, కంబోడియాలు 15 రోజుల వరకు డెలివరీ సమయాన్ని తగ్గించగలవని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ దేశాల్లో వస్త్రాల తయారీ, డెలివరీ ప్రక్రియ 60 నుంచి 90 రోజుల్లో పూర్తవుతుండగా, బంగ్లాదేశ్‌లో దాదాపు 120 రోజులు పడుతోందని వివరించారు.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఆర్డర్లు తరలివస్తున్నాయన్న వార్తలతో భారత వస్త్ర పరిశ్రమకు చెందిన కంపెనీల షేర్లు రాణించాయి. గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ఒక దశలో 11 శాతం వరకు పెరగగా, ట్రైడెంట్ షేరు సుమారు 5 శాతం లాభపడింది. వెల్స్పన్ లివింగ్, కేపీఆర్ మిల్, వర్ధమాన్ టెక్స్టైల్స్ షేర్లు సైతం దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి.
బంగ్లాదేశ్‌పై తమ అవసరాల కోసం ఆధారపడే అనేక అంతర్జాతీయ బ్రాండ్లు ఈ అంతరాయాల వల్ల ప్రభావితమవుతాయని, ముఖ్యంగా తమ సరఫరా గొలుసులో గణనీయ భాగాన్ని బంగ్లాదేశ్‌లో కలిగి ఉన్న బ్రాండ్లు జాప్యాలను, ఉత్పత్తుల లభ్యత తగ్గడాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చునని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ’ (సిఐటిఐ) పేర్కొంది. “దీనివల్ల ప్రపంచ రిటైల్ మార్కెట్లో ఒక రకమైన గొలుసు ప్రతిచర్య ఏర్పడి, నిల్వలు, అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉంది” అని తెలిపింది.

More Stories
కొలీజియం సిఫార్సులు ఓ నిర్దిష్టవర్గంకే అనుకూలం
డ్రగ్స్‌కు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
2.4 కోట్ల ఉద్యోగాలకు ఏఐ ముప్పు