ఢిల్లీ ర్యాలీకి గైర్హాజరైన 202 మందిని కాంగ్రెస్ సస్పెండ్..బిజెపి ఎద్దేవా  

నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి ‘వోట్ బచావో, దేశ్ బచావో’ ర్యాలీకి హాజరుకాని కారణంగా, ఏడు రాష్ట్రాలకు చెందిన 202 మంది కార్యకర్తలను భారత యువజన కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలోని కార్యకర్తలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 
 
ఈ నిర్ణయంపై బీజేపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ సభను బహిష్కరించిన ఆయన సొంత పార్టీ వారే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిని “అసమర్థుడిగా” భావిస్తున్నారని ఆరోపించింది. అందిన గణాంకాల ప్రకారం, గుజరాత్‌లో 49 మంది, పశ్చిమ బెంగాల్‌లో 26 మంది, ఉత్తర ప్రదేశ్ (సెంట్రల్)లో 11 మంది, తెలంగాణలో 14 మంది, హర్యానాలో 10 మంది, మధ్యప్రదేశ్‌లో 60 మంది, జార్ఖండ్‌లో 32 మంది కార్యవర్గ సభ్యులను సస్పెండ్ చేశారు. 
 
ఈ ఏడు రాష్ట్రాలలో సస్పెండ్ అయిన కార్యవర్గ సభ్యుల మొత్తం సంఖ్య 202గా ఉంది. సస్పెండ్ అయిన వారిలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఉన్నారు. ర్యాలీ పట్ల వారి ఉదాసీనతపై వివరణ ఇవ్వాలని కార్యవర్గ సభ్యులను కోరగా, వారి సమాధానాలు సంతృప్తికరంగా లేవని, దాని తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని సమాచారం. మరికొన్ని రాష్ట్రాలకు చెందిన కార్యవర్గ సభ్యులు కూడా క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవచ్చని పార్టీ వర్గాలు సూచించాయి. 
 
‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, భారత యువజన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ, మీ సొంత పార్టీకి చెందిన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు కూడా మిమ్మల్ని అసమర్థుడిగా, చేతకానివాడిగా భావిస్తున్నారు. అందుకే మీ విఫలమైన ర్యాలీని బహిష్కరిస్తున్నారు” అంటూ ధ్వజమెత్తారు. 
 
“మీ ర్యాలీని బహిష్కరించినందుకు మధ్యప్రదేశ్‌లో 80 మందికి పైగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలలో 50 మందికి పైగా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులను సస్పెండ్ చేసిన విషయం నుండి దృష్టి మళ్లించడానికి మీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  మీ బూటకపు పార్లమెంట్, బూటకపు చర్చలు,  బూటకపు ఎన్నికలు నవ్వులపాలయ్యాయి. మీకు నిజంగా చర్చ కావాలంటే, పిరికివాడిలా ప్రవర్తించడం మానేయండి; పార్లమెంటులో ప్రధానమంత్రి మాట్లాడినప్పుడల్లా విదేశాలకు పారిపోవడం ఆపండి” అంటూ అవహేళన చేశారు.

About The Author