ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టన భారత్ ఫైనల్లో జపాన్ను 4–1తో ఓడించి రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గురువారం మొహాలీలోని ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ అంతర్జాతీయ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఫైట్ లో తొలుత వెనుకబడిన భారత్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా నాలుగు గోల్స్ సాధించి జపాన్ను చిత్తు చేసింది.
టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా అజేయంగా నిలిచి, గత ఏడాది సాధించిన టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషంలోనే జపాన్ ఆటగాడు కజుమాసా మాట్సుమోటో గోల్ సాధించాడు. భారత రక్షణను ఛేదించి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో జపాన్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జపాన్ రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యమిస్తూ భారత దాడులను సమర్థంగా అడ్డుకుంది.
తన 200వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడిన వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్, భారత మిడ్‌ఫీల్డ్‌లో కీలక పాత్ర పోషించారు. ఆయన రక్షణ విభాగానికి, ఫార్వర్డ్ లైన్‌కు మధ్య వారధిగా ఉంటూ గోల్ అవకాశాలను సృష్టించారు. మరోవైపు, జర్మన్‌ప్రీత్ సింగ్ తన అద్భుతమైన పనితీరుతో రక్షణ విభాగంలో అత్యంత పటిష్టంగా నిలిచారు. బంతిపై భారత్ ఆధిపత్యం కొనసాగించినప్పటికీ గోల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.
భారత ఆటగాళ్లు పలుమార్లు జపాన్ గోల్‌పోస్ట్ వద్దకు చేరినా ప్రత్యర్థి రక్షణను ఛేదించలేకపోయారు. జపాన్ గోల్‌కీపర్లు కిషో కురోడా, తకుమీ కిటగావా భారత దాడులను అడ్డుకుంటూ జట్టుకు అండగా నిలిచారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి జపాన్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ వరుస దాడులు చేసినప్పటికీ తొలి పెనాల్టీ కార్నర్ 33వ నిమిషంలోనే లభించింది. జపాన్ ఆటగాళ్లు క్రమశిక్షణతో రక్షణను కొనసాగించడంతో భారత ఫార్వర్డ్స్కు గోల్స్ సాధించడం కష్టమైంది.
హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ మైదానంలో చురుగ్గా కదులుతూ బంతిని స్వాధీనం చేసుకునేందుకు శ్రమించారు. అయినప్పటికీ భారత ఆటగాళ్లు కొన్ని అవకాశాలను చేజార్చుకున్నారు. మ్యాచ్ మూడో క్వార్టర్ వరకు భారత్ ఒత్తిడిలో కనిపించింది. అయితే జట్టు ఆటగాళ్లు పట్టుదలతో పోరాడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో లభించిన పెనాల్టీ కార్నర్ భారత జట్టు విజయానికి మలుపుగా నిలిచింది.
ఈ విజయంతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు ఆరు సార్లు ఈ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. మూడు టైటిళ్లతో ఉన్న పాకిస్థాన్ కంటే ముందంజలో ఉంది. 2011లో తొలిసారి టైటిల్ సాధించిన భారత్.. 2016లో రెండోసారి విజేతగా నిలిచింది. 2018లో పాకిస్థాన్‌తో కలిసి సంయుక్త విజేతగా అవతరించింది.
2023లో మలేషియాను ఓడించి నాలుగో టైటిల్‌ను అందుకున్న భారత్.. 2024లో చైనాపై విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు జపాన్‌పై గెలుపుతో ఆరో టైటిల్‌ను సాధించి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. మరోవైపు జపాన్ ఇప్పటివరకు ఈ టోర్నీలో టైటిల్ సాధించలేదు. 2013లో పాకిస్థాన్, 2021లో దక్షిణ కొరియా చేతిలో ఫైనల్లో ఓడిన జపాన్‌కు.. భారత్‌తో జరిగిన తుది పోరులోనూ నిరాశే ఎదురైంది.
ఈ టోర్నీలో భారత జట్టు ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. బంగ్లాదేశ్‌ను 13–0తో, చైనాను 5–2తో, జపాన్ను 4–1తో, మలేషియాను 4–2తో, దక్షిణ కొరియాను 8–0తో ఓడించింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 8–1తో భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

More Stories
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా, బలమైన ప్రజాస్వామ్యం దిశగా ఎస్ఐఆర్
చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి
ఓటములను జీర్ణించుకోలేక వ్యవస్థలను కించపరుస్తున్న కాంగ్రెస్