ఎస్ఐఆర్, ఈవీఎంల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. రాజకీయ చర్చను వీధుల్లో పెట్టకూడదని, పార్లమెంట్ లో పెట్టాలని ఆయన హితవు చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానాలను రాహుల్‌గాంధీ తట్టుకోలేరని ఎద్దేవాచేశారు.
హరియాణాలోని కర్నాల్‌లో బీజేపీ నిర్వహించిన ‘లోక్‌తంత్ర బచావో, అరాజకత హఠావో’ యాత్రలో అమిత్ షా పాల్గొంటూ రాహుల్‌కు నిజంగానే చర్చించాలనే చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ప్రధానమంత్రికి అధికారికంగా లేఖ రాయాలని సూచించారు. ఎస్ఐఆర్, ఈవీఎంలు, చొరబాటుదారుల అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
`బాధ్యతాయుతమైన చర్చ జరగాలని మీరు అనుకుంటే, మీ ఆందోళనల్లో సత్యం, తర్కం ఉంటే రండి పార్లమెంట్‌లో చర్చించుకుందాం’ అని సవాల్ చేశారు. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుందాంగానీ మా సమాధానాలను మీరు తట్టుకోలేరని రాహుల్‌గాంధీని ఉద్దేశించి చెప్పారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా పారిపోతారని ఎద్దేవాచేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు.
పార్లమెంట్‌ను సజావుగా నడవనివ్వకుండా బయట రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని, ప్రవర్తన కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలని రాహుల్ గాంధీకి హితవు అమిత్ షా పలికారు. పార్లమెంట్‌లో చర్చలకు సహకరించకుండా వాకౌట్లు చేయడం, ఆందోళనలకు దిగడం కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని విమర్శించారు. మృతుల పేర్లతో పాటు మూడు కోట్ల మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాల బోగస్ ఓట్లను ఎన్నికల సంఘం తొలగిస్తుంటే రాహుల్ గాంధీకి ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు.
చొరబాటుదారులే కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్నారని, అందుకే ఓటర్ల జాబితా ప్రక్షాళనను అడ్డుకునేందుకు ‘ఓట్ల చోరీ’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌ను పనిచేయనివ్వకుండా బయట వీధుల్లో ఆందోళనలు చేస్తూ అరాచకాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 80 ఏళ్ల ప్రజాస్వామ్యం తమ మోసాలకు లొంగిపోతుందని కాంగ్రెస్ భావిస్తోందా? అని ప్రశ్నించారు.
పార్లమెంట్, శాసనసభలు, గ్రామాలు, పొలాల్లోనూ బీజేపీ కాంగ్రెస్‌కు తగిన సమాధానం ఇస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలను సమీకరించి ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ భావిస్తే, ఎదుర్కొనేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకాన్ని తొలగించండి’ యాత్ర రాహుల్ గాంధీకి బలమైన సమాధానమని చెప్పారు.
మరోవైపు, హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం సామాన్య పౌరుడి ఓటు అని తెలిపారు. సంపద, పలుకుబడి, ప్రముఖ కుటుంబాల మద్దతు లేకపోయినా, పోలింగ్ బూత్‌లో ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు ఉంటుందని గుర్తు చేశారు. ఆ ఒక్క ఓటు రైతుల కష్టం, కార్మికుల ఆకాంక్షలు, యువత భవిష్యత్తు, మహిళల ఆశలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ సాధారణ ప్రక్రియేనని సైనీ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
More Stories
ఆరోసారి ఆసియా హాకీ ఛాంపియన్‌గా భారత్!
ఓటములను జీర్ణించుకోలేక వ్యవస్థలను కించపరుస్తున్న కాంగ్రెస్
అమెరికాలో తొలి ముస్లిం సెనెటర్ ‘ముస్లిం బ్రదర్హుడ్’ సభ్యుడా?