మంగళవారం ఉదయం 5.30 గంటల సమయానికి తుపాను ఒంగోలు సమీపంలో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నదని వివరించింది. బాపట్లకు నైరుతి దిశలో 40 కిలోమీటర్లు, కావలికి ఉత్తర ఈశాన్య దిశలో 80 కిలోమీటర్లు, మచిలీపట్నానికి పశ్చిమ నైరుతి దిశలో 120 కిలోమీటర్లు, నెల్లూరుకు ఉత్తరంగా 130 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రం ఉన్నట్టు వెల్లడించింది.
మురాసు తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. మంగళవారం మధ్యాహ్నానికి తీవ్ర తుపాను స్థాయి నుంచి తుపానుగా మారుతుందని తెలిపింది. ఆ సమయంలో గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అర్ధరాత్రి సమయానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.
అప్పుడు గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మురసు తుపాను ప్రభావంతో అర్ధరాత్రి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒంగోలులో బలమైన ఈదురు గాలులకు చెట్లు వంగిపోయాయి. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షంతో జనజీవనం ప్రభావితమైంది. మచిలీపట్నం, విశాఖపట్నంలోని డాప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా తుపానును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఐఎండీ వెల్లడించింది.
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణాతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ‘మురసు’ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. వివిధ రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ జాబితాలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయని వివరించింది. తుఫాన్ ఈదురు గాలుల వల్ల కారవడి వద్ద పలు రైళ్లు నిలిపివేసినట్లు చెప్పింది. ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో రైలు స్థితి చూసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.

More Stories
టీటీడీకి ముగ్గురు ఉన్నతాధికారులతో ‘స్పెసిఫైడ్ అథారిటీ’
రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాదిపై పోలీసుల కాల్పులు
ఒంగోలు సమీపంలో మురసు తుఫాన్ తీరం దాటే అవకాశం