సింహాచలం ఆలయంలో సాంప్రదాయ దుస్తులతోనే ప్రవేశం 

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న భక్తులు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఇకపై సాంప్రదాయ దుస్తులనే ధరింపవలసి ఉంటుంది.  భక్తుల వస్త్రధారణ విషయంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మోడ్రన్ వెస్ట్రన్ దుస్తులతో వెళ్తే ఇకపై గుడిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
 
ఈ మేరకు కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలను దేవస్థానం రూపొందించింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వీటిని కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షించడం, ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ నియమావళిని తీసుకొచ్చినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. 
 
కొత్త రూల్స్ ప్రకారం జీన్స్, టీషర్టులు, షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్ వంటి ఆధునిక వస్త్రాలు ధరించి వెళ్లే భక్తులకు ఆలయంలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టనున్నారు. దైవ సన్నిధికి తగ్గట్టుగా భక్తులు హుందాగా, సంప్రదాయబద్ధంగా రావాలని దేవస్థానం కోరింది. స్వామి దర్శనార్థం వెళ్లే భక్తుల కోసం ఆలయ అధికారులు స్పష్టమైన వస్త్రధారణ మార్గదర్శకాలను విడుదల చేశారు.
 
మగవాళ్లైతే తప్పనిసరిగా ధోతీ (పంచె)తో పాటు అంగవస్త్రం గానీ, కుర్తా పైజామా గానీ ధరించాలి. ఒకవేళ అవి అందుబాటులో లేని పక్షంలో సంప్రదాయబద్ధమైన ఫార్మల్ ప్యాంట్, షర్ట్ వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మహిళలైతే చీర, లంగావోణీ లేదా కచ్చితంగా దుపట్టా (చున్నీ) కలిగిన చుడీదార్ మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

సాధారణ దర్శనాలతో పాటు ఆలయంలో నిత్యం జరిగే కళ్యాణం, ఇతర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఈ నియమాలు మరింత కఠినంగా అమలు కానున్నాయి. సేవల్లో కూర్చునే మగ భక్తులు కచ్చితంగా ధోతీ అంగవస్త్రం లేదా సంప్రదాయ కుర్తా, పైజామా మాత్రమే ధరించాలని అధికారులు తెలియజేశారు. డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న నేపథ్యంలో.. సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.

About The Author