ఆంధ్రప్రదేశ్ లో పురపాలక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. ఎన్నికలు దాదాపుగా ఏకపక్షంగా జరిగాయి. ప్రతిపక్షం వైసీపీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 83 మున్సిపాలిటీల్లో కూటమి విజయభేరీ మోగించింది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరుగగా, ఒక్క అనంతపూర్ లో మినహా అన్నింట్లో కూటమి అభ్యర్థులే గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ మాత్రం ఒక్క కార్పొరేషన్‌తోపాటు మూడు మున్సిపాలిటీలను గెలుచుకుంది. అనంతపురం కార్పొరేషన్ తో పాటు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, బేతంచర్లతోపాటు చిత్తూరు జిల్లాలోని నాయుడుపేటలో మాత్రమే వైసీపీ గెలుపొందింది. ఒంగోలు మేయర్ పీఠం ఇంకా తేలలేదు. ఈ నగర మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మేయర్ గా గెలుపొందిన అభ్యర్థులు:
కడప: సువర్ణ (టీడీపీ), విజయనగరం: భార్గవి (టీడీపీ), విశాఖపట్నం: శ్రావణి (టీడీపీ), మచిలీపట్నం: అబ్దుల్ అబిదా (టీడీపీ), చిత్తూరు: హేమలత (టీడీపీ), తిరుపతి: శ్రీనివాస ప్రసాద్ (టీడీపీ), గుంటూరు: కె. లక్ష్మీ అపర్ణ (టీడీపీ), నెల్లూరు: రూప్ కుమార్ (టీడీపీ), కర్నూలు: విజయ ప్రత్యూష (టీడీపీ), ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు (జనసేన పార్టీ), విజయవాడ : వంగవీటి రాధాకృష్ణ (జనసేన పార్టీ), అనంతపురం: రమేష్ గౌడ్ (వైసిపి).
వైఎస్సార్సీపీకి కంచుకోటలు, తమకు బాగా బలముందని ఆ పార్టీ నేతలు చెప్పుకొనే నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. 22 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో ఆ పార్టీ కనీసం ఒక్క వార్డైనా గెలవలేకపోయింది. 2024 ఎన్నికల ఫలితాల్లాగే మరోసారి 100శాతం స్ట్రైక్‌రేట్‌తో గ్రాండ్ విక్టరీని అందుకుంది.
నేటి స్థానిక ఎన్నికల ఫలితాలే తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన మాండేట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సుపరిపాలనను మెచ్చి ప్రజలు కూటమికి తీర్పు ఇస్తున్నారని వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినప్పుడే వారి ఆశీస్సులు లభిస్తాయని తెలిపారు. ‘గుడ్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్’ తన ప్రాధాన్యతని, రాజకీయాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తానని తేల్చిచెప్పారు. ప్రజల మనోభావాలు ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిబింబించాయని, కూటమిపై ప్రజల విశ్వసనీయతకు ఫలితాలే నిదర్శనమని చంద్రబాబు ఉద్ఘాటించారు.
అయితే, ఇవి ఎన్నికలు కావని, ఎంపికలని కూటమి ప్రభుత్వం, పోలీసులపై తీవ్రస్థాయిలో వారిపై అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నామినేషన్ ప్రక్రియను అపహాస్యం చేశారని, స్క్రూట్నీలోనూ అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. ఓట్ల లెక్కింపును కూడా హైజాక్ చేశారని, ప్రతిపక్ష పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

More Stories
జాతీయ చైతన్యానికి మార్గదర్శి రాజనారాయణ బసు
చొరబాటు, జనాభా స్వరూపం, జాతీయ భద్రత దృష్ట్యా ‘ఎస్ఐఆర్’
అశేష జనవాహిని మధ్య నిర్మల్ లో ‘బీజేపీ మహాపాదయాత్ర’