హరీష్‌రావుపై మరో ఫోన్ ట్యాపింగ్ కేసు

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గతంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సిద్దిపేటకు బదిలీ చేయడంతో పోలీసులు కొత్త క్రైమ్ నంబర్‌తో కేసు రిజిస్టర్ చేశారు. అంతేకాకుండా పాత ఎఫ్‌ఐఆర్‌లో లేని మరో ఆరు సెక్షన్లను అదనంగా చేర్చడం ఈ వ్యవహారంలో ఇప్పుడు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌తో పాటు తన భార్య ఫోన్‌ను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని సిద్దిపేటకు చెందిన గాదగోని చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు 2024 డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో క్రైమ్ నంబర్ 1205/2024 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 
ఆ సమయంలో ఈ కేసులో హరీశ్‌రావును ఏ1గా, అప్పటి మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏ2గా పేర్కొన్నారు. అయితే హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతరం చక్రధర్‌గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లు అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. 
 
తాజాగా ఈ కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అక్కడ పోలీసులు క్రైమ్ నంబర్ 496/2026తో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పాత కేసులో పేర్కొన్న సెక్షన్లకు అదనంగా ఆరు సెక్షన్లను చేర్చినట్లు సమాచారం. వాటిలో ఐపీసీ 419, 420, 467, 406 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద 66C, 66D సెక్షన్లు ఉన్నాయి. 
 
ఈ సెక్షన్లు వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేయడం, మోసం, ఫోర్జరీ, నమ్మకద్రోహం, కంప్యూటర్ సంబంధిత గుర్తింపు దుర్వినియోగం, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన అంశాలను కలిగి ఉంటాయి. కొత్త ఎఫ్‌ఐఆర్‌లోనూ తన్నీరు హరీశ్‌రావు పేరును ఏ1గా, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు పేరును ఏ2గా పేర్కొన్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

About The Author