దేశం, ధర్మం కోసం మహిళలు కర్తవ్యనిష్ఠతో పని చేయాలి 


* దుర్గా వాహిని కన్వీనర్ ప్రగ్యా దీదీ పిలుపు ..జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన పాత బస్తీ 
ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వాన్ని, జిజియాబాయి మాతృత్వ సంస్కారాలను ఆదర్శంగా తీసుకొని మహిళలు దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం కర్తవ్యనిష్ఠతో పనిచేయాలని విశ్వహిందూ పరిషత్ యువ మహిళా విభాగమైన దుర్గావాహిని అఖిల భారత కన్వీనర్ ప్రగ్యా దీదీ పిలుపునిచ్చారు.   భాగ్యనగర్ పాతబస్తీలోని గౌలిపుర మిత్ర క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన హిందూ యువ మహిళల సమ్మేళనంలో ఆమె ప్రసంగిస్తూ  హిందూ ధర్మ పరిరక్షణలో మహిళా శక్తి కీలక పాత్ర పోషించాలని కోరారు. 
 

దాదాపు వెయ్యి మంది దుర్గావాహిని కార్యకర్తలు యూనిఫామ్‌లో పాల్గొని సంఘటిత మహిళా శక్తిని చాటారు. శక్తి సంచలన్, శక్తి వందన్ కార్యక్రమాల్లో భాగంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ హైదరాబాద్ పాత బస్తీ దద్దరిల్లింది.  దుర్గా వాహిని కార్యకర్తలపై స్థానికులు పూల వర్షం కురిపించి ఆత్మీయతను చాటుకున్నారు. అడుగడుగునా కాషాయ జెండాలతో రహదారులు శోభించాయి.

లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి మందిర పరిసర ప్రాంతంతోపాటు పలు ఆలయాల వద్ద దుర్గవాహిని కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి వాణి సక్కుబాయి అధ్యక్షత జరిగిన బహిరంగసభలో ప్రగ్యా దీదీ మాట్లాడుతూ జిజియాబాయి తన మాతృత్వ సంస్కారాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి ధర్మరక్షకుడిని తీర్చిదిద్దారని, ఝాన్సీ లక్ష్మీబాయి తన వీరోచిత పోరాటంతో భారతీయ మహిళా శక్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని గుర్తు చేశారు. 
 
అలాంటి మహనీయుల జీవితాలు ప్రతి యువతికి స్ఫూర్తి కావాలని, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కర్తవ్యనిష్ఠతో సమాజంలో ముందుండాలని సూచించారు.
రోహింగ్యాలు, బంగ్లాదేశస్తులు భారత్ లోకి చొరబడి హిందువులపై  దాడులు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న అవమానకర చర్యలను ఖండిస్తూ ఉద్యమించాలని ఆకాంక్షించారు.

మహిళలపై వేధింపులు, హింస, ప్రేమ పేరుతో మోసాలు, లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడులు వంటి ఘటనల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. మహిళల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, భద్రతకు భంగం కలిగించే ప్రతి చర్యను చట్టబద్ధంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపిచ్చారు.  గోమాత గౌరవాన్ని కాపాడాలని, భారతీయ ఇతిహాసాలు, దేవాలయాలు, ధార్మిక సంప్రదాయాల పరిరక్షణలో మహిళలు భాగస్వాములు కావాలని 
ప్రగ్యా దీదీ చెప్పారు. 
 
హిందూ ధర్మం కేవలం ఆచార వ్యవహారం కాదని, ప్రేమ, కరుణ, సేవ, త్యాగం, మానవత్వం, కుటుంబ విలువల సమాహారమని ఆమె పేర్కొన్నారు. మనం ఆరాధించే దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వంటి దేవతామూర్తులు మహిళా శక్తికి ప్రతీకలని చెబుతూ మహిళలు సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు.  దుష్టశక్తులపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి, దీపావళి పండుగలు ప్రతీకలని వివరించారు. 
 
భారతీయ కుటుంబ వ్యవస్థ అత్యంత పవిత్రమైనదని, తల్లి తన పిల్లలకు అందించే సంస్కారాలే దేశ భవిష్యత్తుకు పునాదులని ఆమె చెప్పారు. ప్రేమ, కరుణ, ఆప్యాయతలను పంచుతూనే అవసరమైనప్పుడు అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మహిళలు ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు. మనం కొలిచే దేవతలందరూ మహిళలేనని పేర్కొంటూ మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఆత్మవిశ్వాసం నూరిపోశారు. 
 
రాక్షసులను సంహరించే శక్తి మహిళలకు మాత్రమే ఉందని, రాక్షసులను సంహరించింది..చెడుపై పోరాడి విజయం సాధించింది మహిళలేనని ఆమె చెప్పారు. మతమార్పిడి విషయంలో మహిళ లోకాన్ని అప్రమత్తం చేసే బాధ్యత దుర్గా వాహిని కార్యకర్తలదే అని ఆమె తెలిపారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
 
భారతీయ మహిళ పోరాటంలో వెనకడుగు వేయకూడదని చెబుతూ హిందూ ధర్మంలో భారతీయ మహిళ గొప్ప స్థానం కలిగి ఉందని, దానిని ప్రపంచ దేశాలు గౌరవించేలా దుర్గా వాహిని కార్యకర్తలు మరింత పోరాటం చేయాలని ఆమె కోరారు. ఇటీవల దుర్గా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకున్నామని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుర్గా వాహిని ఆధ్వర్యంలో వైభవమైన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం మరింత శోభను చేకరుస్తుంది అని ఆమె  ఆనందం వ్యక్తం చేశారు.

దుర్గావాహిని కార్యకర్తలు కేవలం సంఘటిత శక్తిగా కాకుండా సేవ, సంస్కారం, సాహసం, సమాజ శ్రేయస్సుకు ప్రతిరూపాలుగా ఎదగాలని ప్రగ్యా దీదీ పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ అగ్రనేత దివంగత అశోక్ సింగల్ గారి శతజయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో వైభవంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
 
భక్తి, ఆధ్యాత్మికత నాటకాలతో పాటు కూచిపూడి నాట్యం ప్రదర్శించారు.  దుర్గా వాహిని కార్యకర్తలు కర్ర యుద్ధం, ముష్టి యుద్ధం, కత్తి యుద్ధం తోపాటు పలు విన్యాసాలు ప్రదర్శించారు. క్షేత్ర సంఘటన మంత్రి  గుమ్మల్ల సత్యం, రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ధర్మాచార్య సంపర్క ప్రముక్ పగడాకుల బాలస్వామి, సరస్వతి శిశు మందిరం ప్రాంత పాలకమండలి సభ్యులు.  అలివేలు మంగమ్మ, ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

  

About The Author