హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, చివరకు ప్రశాంతంగా ఉండాల్సిన నిశ్శబ్ద జోన్లలోనూ నిర్ణీత పరిమితులను మించి శబ్దాలు నమోదవుతున్నాయి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) జనవరి నుంచి జులై వరకు సేకరించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, చివరకు నిశ్శబ్ద ప్రాంతాలుగా ప్రకటించిన జోన్లలోనూ అనుమతించిన పరిమితులకు మించి శబ్దాలు నమోదవుతున్నాయి.
నగరంలోని పలు ప్రాంతాల్లో పగలు, రాత్రి వేళల్లోనూ శబ్ద స్థాయులు నిర్దేశిత ప్రమాణాలను దాటుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, తార్నాకలోని నివాస ప్రాంతాల్లో పర్యవేక్షణ జరిగిన కాలమంతా అనుమతించిన స్థాయికి మించి శబ్ద కాలుష్యం నమోదైంది. వాణిజ్య ప్రాంతమైన జేఎన్‌టీయూలోనూ ఇదే పరిస్థితి కొనసాగగా.. అబిడ్స్‌లో పలు నెలలపాటు రాత్రి వేళల్లో పరిమితులు ఉల్లంఘించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
నగరంలో శబ్ద కాలుష్యానికి వాహనాల రాకపోకలు, అనవసర హారన్ల మోత ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అధిక శబ్దంతో మోగించే డీజేలు, నిర్మాణ పనులు, ఫంక్షన్ హాళ్లలో జరిగే కార్యక్రమాలు కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రోడ్డు భద్రత కార్యకర్త అరుణ్ బతులా తెలిపిన వివరాల ప్రకారం వినాయక చవితికి ముందు ఆయన ట్రాఫిక్ పోలీసులతో కలిసి సచివాలయం సమీపంలోని తెలంగాణ తల్లి కూడలిలో గంటపాటు శబ్ద స్థాయులను పరిశీలించారు.
ఆ సమయంలో 82 నుంచి 110 డెసిబెల్స్ వరకు శబ్దం నమోదైంది. నిరంతరం వినిపించే హారన్లను ఎలా భరిస్తున్నారని అక్కడి సిబ్బందిని అడిగితే, ఆ శబ్దాలకు అలవాటు పడిపోయామని కొందరు చెప్పినట్లు ఆయన వివరించారు. మరికొందరు నిద్రలోనూ హారన్ల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. అనవసరంగా హారన్లు మోగించకుండా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు.
హెచ్‌సీఎస్‌సీ వాలంటీర్ల సహకారంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదనపు మల్టీ హారన్లు అమర్చిన వాహనాలపై క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, హారన్లే శబ్ద కాలుష్యానికి ప్రధాన కారణమని, శివారు ప్రాంతాల్లో నిర్మాణ పనుల వల్ల శబ్దం ఎక్కువగా ఉంటోందని వివరించారు. నిశ్శబ్ద ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల కూడా పరిస్థితి మెరుగ్గా లేదు. జూ పార్కులో పగటి వేళల్లో అనుమతించిన శబ్ద పరిమితి 50 డెసిబెల్స్ కాగా, జనవరిలో 56.6 డెసిబెల్స్‌గా నమోదైన స్థాయి జులై నాటికి 61.5 డెసిబెల్స్‌కు చేరింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లోనూ శబ్ద స్థాయులు సుమారు 70 డెసిబెల్స్‌గా ఉండగా, జులైలో 71.3 డెసిబెల్స్‌కు చేరాయి. రోడ్డు రవాణా వల్లే మొత్తం శబ్ద కాలుష్యంలో సుమారు 60 నుంచి 70 శాతం వాటా ఉంటుందని రోడ్డు భద్రత నిపుణుడు లోకేంద్ర సింగ్ తెలిపారు. గతంలో అనుమతించిన స్థాయికి మించి శబ్దం చేసే వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు అకౌస్టిక్ కెమెరాల ప్రయోగం చేపట్టారని, వాటి ద్వారా శబ్ద తీవ్రతను కొలిచి నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు ఈ-చలానాలు జారీ చేసే అవకాశం ఉండేదని వివరించారు.
అయితే ఆ ప్రయత్నం ముందుకు సాగలేదని చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలతోపాటు ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు, నిరంతర తనిఖీలు, ఉల్లంఘనలపై కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Stories
హైలో ఓపెన్ విజేతలుగా పీవీ సింధు, లక్ష్యసేన్
రామ్‌లీలా మైదానంలో 10 లక్షల మంది ఎక్కడ రాహుల్!.. బీజేపీ
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్