ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ తయారీ దేశంగా భార‌త్‌

ఒకప్పుడు మొబైల్‌ ఫోన్ల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ తయారీ దేశంగా ఎదిగింది. దేశంలో వినియోగిస్తున్న మొబైల్‌ ఫోన్లలో 99.2 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. 2025-26లో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి విలువ రూ.6.27 లక్షల కోట్లకు , ఎగుమతులు రూ.2.59 లక్షల కోట్లకు చేరాయి. ఈ మార్పు వెనుక కీలక పాత్ర పోషించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, 2026 మార్చితో ముగిసింది. 

అయితే పీఎల్ఐతో ఏర్పడిన తయారీ పునాదిని ఇప్పుడు మరో భారీ పథకం ద్వారా మరింత బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అందించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ద్వారా మొబైల్‌ తయారీ, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.  కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, మొబైల్‌ తయారీ రంగానికి ప్రభుత్వం సుమారు రూ.19 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించగా, ఈ రంగం నుంచి రూ.25 వేల కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయం సమకూరింది. అదనంగా రూ.3 వేల కోట్ల జీఎస్టీ ఆదాయం లభించింది. 

ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో 25 లక్షల మంది పనిచేస్తుండగా, మొబైల్‌ తయారీ రంగంలోనే 12 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.62,500 కోట్లతో మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకాన్ని తీసుకొచ్చింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమల్లో ఉండే ఈ పథకం ద్వారా దేశీయంగా మొబైల్‌ ఉత్పత్తి, విడిభాగాల తయారీ, ఎగుమతులు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
భారతీయ మొబైల్‌ బ్రాండ్ల అభివృద్ధి, పరిశోధన, డిజైన్‌ సామర్థ్యాలకు కూడా ప్రోత్సాహం లభించనుంది.  కొత్త పథకం ద్వారా సుమారు రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ ఉత్పత్తి సాధించాలని, 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌ను ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.
 
2014-15లో దేశంలో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి విలువ సుమారు రూ.18 వేల కోట్లు మాత్రమే. 2025-26 నాటికి అది రూ.6.27 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు 33 రెట్ల వృద్ధి . ఇదే సమయంలో మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు రూ.1,500 కోట్ల స్థాయి నుంచి సుమారు రూ.2.59 లక్షల కోట్లకు పెరిగాయి. 2025-26లో స్మార్ట్‌ఫోన్లు భారత్‌ నుంచి ఎగుమతి అవుతున్న అతిపెద్ద వ్యక్తిగత ఉత్పత్తి విభాగంగా ఎదిగాయి.

ఇది కీలకమైన మార్పు. ఎందుకంటే భారత్‌ కేవలం దేశీయ డిమాండ్‌ కోసం ఫోన్లు తయారు చేయడం నుంచి ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తి చేసే స్థాయికి చేరిందని దీని అర్థం. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం ప్రస్తుతం సుమారు 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో మొబైల్‌ తయారీ రంగంలోనే దాదాపు 12 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి.

మరో ఆసక్తికర అంశం మొబైల్‌ తయారీ ప్రత్యక్ష ఉద్యోగుల్లో మహిళల వాటా దాదాపు 70 శాతం గా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులోని హోసూర్‌, శ్రీపెరంబుదూర్‌, బెంగళూరు వంటి తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.  ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌ రంగంలో దేశీయ విలువ జోడింపు సుమారు 23 శాతానికి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది.

కొత్త పథకం ఐదేళ్ల కాలంలో దేశంలో మొత్తం మొబైల్‌ ఉత్పత్తి విలువను సుమారు రూ.39 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఎగుమతులు గణనీయంగా పెరగడంతో పాటు సుమారు 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో భారీ స్థాయిలో మొబైల్‌ తయారీ జరిగినా  ప్రపంచ మార్కెట్లో బలమైన భారతీయ మొబైల్‌ బ్రాండ్లు పెద్దగా ఎదగలేదు. అందుకనే ఇకపై లక్ష్యం కేవలం విదేశీ కంపెనీలకు భారత్‌ను తయారీ స్థావరంగా మార్చడం కాకుండా భారతీయ కంపెనీలు కూడా గ్లోబల్‌ బ్రాండ్లుగా ఎదగాలన్నదే తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నారు. 

About The Author