భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా 2,232 కిలోల బరువున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. శుక్రవారం రాత్రి 11.51 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగివైపు దూసుకెళ్లింది.
నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాన్ని జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఇది నావిక్ వ్యవస్థకు కీలక ముందడుగు కానుంది. సుమారు 50 మీటర్ల ఎత్తు, 420 టన్నుల బరువున్న జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్‌కు ఇది 20వ ప్రయోగం. రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో ఎన్వీఎస్-03 మూడోది. ఈ ఉపగ్రహం సుమారు 13 ఏళ్ల పాటు సేవలందించేలా రూపొందించారు.
రెండు స్వదేశీ అణు గడియారాలు ఇప్పటికే కక్ష్యలో పనిచేస్తున్నాయని, మూడవది కొత్తగా ప్రయోగించిన ఉపగ్రహంలో అమర్చామని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. భారతదేశం అంతటా, దాని సరిహద్దులకు 1,500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సేవలను అందించే లక్ష్యంతో ఉన్న భారతదేశ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో భాగంగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఆయన చెప్పారు. అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం భారతదేశానికి గర్వకారణమని ఈ ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
గతంలో ఎన్వీఎస్-02 ఉపగ్రహం కక్ష్యను పెంచే ప్రక్రియలో సాంకేతిక సమస్య ఎదుర్కొన్న నేపథ్యంలో తాజా ప్రయోగంపై ఇస్రో ప్రత్యేక దృష్టి పెట్టింది. మన ఫోన్లో లొకేషన్ చూడాలన్నా. గూగుల్ మ్యాప్స్‌లో రూట్ తెలుసుకోవాలన్నా సాధారణంగా జీపీఎస్ సేవలను ఉపయోగిస్తాం. అమెరికా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థకు దీటుగా భారత్ కూడా సొంతంగా రూపొందించుకున్న నావిగేషన్ వ్యవస్థే ‘నావిక్’.
దీని పూర్తి పేరు ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్’. జీపీఎస్ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తుంటే నావిక్ ప్రధానంగా భారత్, చుట్టుపక్కల ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు దీని సేవలు అందేలా డిజైన్ చేశారు.
రైల్వే రైళ్లను రియల్‌టైమ్‌లో ట్రాక్ చేయడం, వాహనాల కదలికలను పర్యవేక్షించడం, సముద్రంలో మత్స్యకారుల పడవలను గుర్తించడం వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది. విమానాలు, నౌకల నావిగేషన్‌లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో హెచ్చరికలు పంపడం, విద్యుత్ గ్రిడ్లలో సమయాన్ని సమన్వయం చేయడం, వివిధ పరికరాలకు జియో ట్యాగింగ్ చేయడం వంటి పనుల్లోనూ నావిక్ సేవలు ఉపయోగపడతాయి.
అవసరమైన లొకేషన్, టైమింగ్ సేవల కోసం విదేశీ వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడకుండా ఉండేందుకు ఈ స్వదేశీ టెక్నాలజీ కీలకంగా మారింది. ఈ ఉపగ్రహంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అణు గడియారంతో పాటు ఇతర అణు గడియారాలను కూడా అమర్చారు. నావిగేషన్ వ్యవస్థలో కచ్చితమైన సమయం చాలా ముఖ్యం.
ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నళ్ల ఆధారంగా మన స్థానం ఎంత కచ్చితంగా గుర్తించాలనేది ఈ సమయ గణనపై ఆధారపడి ఉంటుంది. అందుకే అణు గడియారాలు కీలకంగా పనిచేస్తాయి. ఇప్పటివరకు నావిక్ ఉపగ్రహాలు ఎల్5, ఎస్ బ్యాండ్లలో సిగ్నళ్లు అందిస్తుండగా, ఎన్వీఎస్-03లో అదనంగా ఎల్1 సిగ్నల్ సదుపాయాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు.
దీంతో ఈ సిగ్నల్‌కు అనుకూలమైన పరికరాల్లో నావిక్ సేవలను ఉపయోగించుకునే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆధునిక స్మార్ట్ఫోన్లు, ఇతర నావిగేషన్ పరికరాల్లో ఈ సేవల వినియోగానికి ఇది ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరి, అవసరమైన కక్ష్య మార్పులను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే నావిక్ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది.
తర్వాత ఎన్వీఎస్-04, ఎన్వీఎస్-05 ఉపగ్రహాలను కూడా ప్రయోగించి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా.. జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం భారత్ సొంత నావిగేషన్ సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలక అడుగుగా నిలవనుంది.

More Stories
మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు దేశవ్యాప్తంగా గందరగోళం!
నవంబర్ 1న 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు నిరసన
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు జైలులోనే ముప్పు!