రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు రాష్ట్రమంతటా తిరుగుతానని, ఆ పని చేయని పక్షంలో రాజకీయాల నుండి తప్పుకుంటానని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలనే డిమాండ్‌తో నాలుగు రోజులుగా డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో పాదయాత్ర శుక్రవారం సాయంత్రం జవహర్ నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగిసింది.
“ఈ నాలుగు రోజుల పాదయాత్రలో నేను చూసిన బాధితుల కన్నీళ్లు నన్ను తీవ్రంగా కలచివేశాయి. వారి గాథలు వింటుంటే నా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఉన్న సమస్యలు వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడ చెత్త వేయడానికి వీలులేదని ఎన్జీటీ కూడా జరిమానా వేసింది. కానీ, అన్నీ తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమీ పట్టనట్టు తాత్సారం చేస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
“అప్పట్లో ఈ అంశంపై కేసు వేసింది నువ్వే కదా! నిన్ను ఓడిపోతే గెలిపించిన మల్కాజిగిరి ప్రజలను నిచ్చెన మెట్లలాగా వాడుకుని ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు వీళ్లను మోసం చేశావు. సీఎం గారు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నా.. మీకు చేతకాకపోతే దీనికి సంబంధించిన డీపీఆర్ తయారు చేసి ఇవ్వండి, కేంద్రం నుంచి నేను స్వయంగా మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాను” అని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యపై స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ చేయకపోతే రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని పేర్కొంటూ ఆ పనేదో తామే చేస్తామని స్పష్టం చేశారు. ధమ్మాయిగూడా డివిజన్లలో పర్యటించినప్పుడు కాలనీల ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. బీజేపీ సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావు, చీకోటి ప్రవీణ్ కుమార్, కీర్తిరెడ్డి తోపాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎంపీకి పనిలేక పాదయాత్ర పేరుతో తిరుగుతున్నాడంటూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ కోసమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు రాష్ట్రమంతటా తిరుగుతానని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలను నిచ్చెన మెట్లలా వాడుకొని అందలం ఎక్కిన నాయకులకు భవిష్యత్తులో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
చెత్త లారీల చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన యువకుల భార్యల పుస్తెల తాడుల సాక్షిగా డంపింగ్ యార్డుకు అంతం పలుకుతామని పేర్కొన్నారు.
మానవత్వం ఉన్నవారు ఎవరైనా ఈ సమస్యపై స్పందిస్తారని, నిజాయితీ ఉంటే డంపింగ్ యార్డు సమస్యపై డీపీఆర్ సిద్ధం చేసి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీలం ప్రధాని మోదీని ఒప్పించి నిధులు తెస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పాదయతలో తొలిరోజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పాల్గొనగా, ఆ తర్వాత బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఎం రఘునందన్ రావు,
ఎమ్యెల్యేలు రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, ధర్మపాల్ సూర్యనారాయణ, ఎంఎల్సీలు అంజిరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More Stories
భారత్ లో తీవ్ర పేదరికం 12 ఏళ్లలో 27.1% నుండి 2.6%కి తగ్గింది
మీ అసంతృప్తిని గోమతీ నదిలో పారేయండి
కక్ష్యలోకి మూడో స్వదేశీ అణు గడియారం