మీ అసంతృప్తిని గోమతీ నదిలో పారేయండి

* యూపీ బీజేపీ కార్యకర్తలకు అమిత్ షా సందేశం 
 
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మూడవసారి వరుసగా అధికారంలోకి తీసుకువచ్చేందుకు, పార్టీ కార్యకర్తలు తమ విభేదాలను, అసంతృప్తిని పక్కన పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పిలుపునిచ్చారు. తమ మనసుల్లో ఉన్న నిరాశ, అసంతృప్తిని “గోమతీ నదిలో పారేసి” వెళ్లాలని ఆయన సూచించారు. 
“మీ మనసుల్లో ఉన్న నిరాశ, అసంతృప్తి ఏదైనా ఉంటే, ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు వాటిని గోమతీ నదిలో పారేసి వెళ్లండి. మనం ఐక్యంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఆశించినవి దక్కకపోవచ్చు” అని లక్నోలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ కార్యకర్తలు, ప్రాంతీయ నాయకులతో అమిత్ షా చెప్పారు.
 
పార్టీలో చాలామందికి తాము చేసిన కృషికి తగిన పదవులు లేదా గుర్తింపు లభించకపోవచ్చు, కానీ యూపీలో అందరికీ ప్రభుత్వ సంస్థలు, ఇతర విభాగాల్లో అవకాశం కల్పించేందుకు పార్టీ గరిష్ట స్థాయిలో సర్దుబాట్లు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెలలో జరిగిన ఫీడ్‌బ్యాక్ ప్రక్రియలో, పలువురు ప్రాంతీయ నాయకులు పార్టీ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమను విస్మరిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
వారణాసిలో బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఒక నాయకుడు మాట్లాడుతూ ఎన్నికల్లో టిక్కెట్లు లేదా మంత్రి పదవులను “బయటి వ్యక్తులకు” ఇవ్వడం ఒకవేళ ఆమోదయోగ్యమే అయినా, కీలకమైన పార్టీ పదవుల్లో వారిని నియమించడం వల్ల “నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు వారితో కలిసి పనిచేయడం కష్టమవుతుంది” అని పేర్కొన్నారు. 
 
ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో, మొత్తం 11 స్థానాలకు గాను ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుంది. ఈ ఫలితాలు బీజేపీకి నిరాశ కలిగించాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ తన పనితీరును మెరుగు పరచుకోలేకపోవడానికి, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి కూడా ఒక కారణమని బీజేపీలోని కొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి. 
 
తన ప్రసంగంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీని స్మరించుకుంటూ, “రాజకీయ ప్రాధాన్యతలు మారవచ్చు, కానీ పార్టీ విలువలు, ఆదర్శాలు, సిద్ధాంతం ఎప్పటికీ మారవు అని అద్వానీ గారు తరచుగా చెప్పేవారు. బీజేపీ కార్యకర్తలు అదే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ, వ్యక్తిగత పరువు లేదా అవమానాన్ని లెక్కచేయకుండా పూర్తి అంకితభావంతో పనిచేస్తారు” అని భరోసా వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు అంశాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. “మనం ప్రతి బూత్‌లో చురుకుగా ఉన్నామా? మన బూత్ కమిటీలు క్రమం తప్పకుండా పనిచేస్తున్నాయా? మన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారా?మన మండల, ప్రాంతీయ, జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులు ప్రజల్లో మమేకమై ఉన్నారా?” అని ప్రశ్నించుకోవాలి సూచించారు. 
 
శాసనసభ్యులతో సహా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు కొనసాగించాలని, మాట్లాడటం కంటే వారి మాటలను ఎక్కువగా వినాలని చౌదరి కోరారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య బలమైన సమన్వయం అవసరాన్ని నొక్కిచెబుతూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంస్థతో సంప్రదింపులు కొనసాగించాలని చౌదరి విజ్ఞప్తి చేశారు.

ఎస్ఐఆర్ పై ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశంలో చర్చకు సిద్ధమా?

ఎస్ఐఆర్ ప్రక్రియపై విపక్ష ఇండియా కూటమి చేస్తోన్న ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి కొట్టిపారవేస్తూ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశంలో చర్చకు రావాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లకు సవాల్ విసిరారు. ‘‘నేను ఇప్పుడే మీ ఇద్దరికీ (రాహుల్, అఖిలేష్) సవాల్ విసురుతున్నాను.  దీనిపై పార్లమెంట్‌లో చర్చించడానికి బీజేపీ పూర్తిగా సిద్ధంగా ఉంది. దాచడానికి మా దగ్గర ఏమీ లేదు. రండి, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం’’ అని చెప్పారు. 
 
‘‘కానీ వారికి అక్కడ మాట్లాడే ఉద్దేశం లేదు. వారు పార్లమెంట్‌ను సాగనివ్వరు.. కేవలం గందరగోళం సృష్టిస్తారు’’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ `ఈ అంశంపై పార్లమెంట్‌లో ఎప్పుడూ చర్చించరు, కానీ వీధుల్లో మాత్రం రచ్చ చేస్తారు’ అని విమర్శించారు. హర్యానా, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ విజయాలను ప్రస్తావిస్తూ ‘బెంగాల్ పరిణామాల తర్వాత, తాము ఎన్నికల్లో గెలవలేమని వారు గ్రహించారు. ఓటమిని అంగీకరించే బదులు, ఓట్లు దొంగిలించారంటూ అంపైర్ (ఎన్నికల కమిషన్) చీటింగ్ చేస్తున్నారని ఆరోపించడం మొదలుపెట్టారు’ అని షా దుయ్యబట్టారు.

 

About The Author