“మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు ‘కొంతమంది దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించడానికి’ ప్రయత్నిస్తున్నారు” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిశితంగా విమర్శించారు. ఇరాన్, అమెరికా యుద్ధంతో అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్నదని, ఇలాంటి సమయంలో విపక్షాలు దేశంలో వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంటూ ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గుజరాత్‌లోని బనస్కాంతలోని భిల్డి గ్రామంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించి, ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి తాను “నా జీవితంలోని చివరి క్షణం వరకు” దేశానికి సేవ చేస్తానని కూడా పేర్కొన్నారు. గత ఆదివారం పాట్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన “మోదీ కా బాప్ భీ జాయేగా” వ్యాఖ్యలకు ఇది ప్రతిస్పందనగా భావిస్తున్నారు.
“ఈరోజు దేశంలోని ప్రతి రైతు, ప్రతి యువకుడు, ప్రతి మహిళ, కుమార్తె అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు, కొంతమందికి ఇది నచ్చదు. వీరు దేశం కష్టాల్లో ఉండాలని కోరుకునే వ్యక్తులు. దేశం బాధపడినప్పుడు వారు ఆనందం పొందుతారు, దేశం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు వారు సంతోషిస్తారు,” అని ప్రధాని ధ్వజమెత్తారు.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా పేర్కొన్నారు: “భారతదేశం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కృషి చేస్తుంటే, కొందరు వ్యక్తులు మాత్రం అబద్ధపు ప్రచారాలు చేయడంలో నిమగ్నమయ్యారు. రైతులకు ఎరువులు అందవని నమ్మించి, వారిని కృత్రిమ క్యూలలో నిలబడేలా చేశారు. తద్వారా వాతావరణాన్ని కలుషితం చేశారు” అని విమర్శించారు.
“వంట గ్యాస్ ఇక దొరకదని చెప్పి మహిళల్లో భయాందోళనలు సృష్టించారు. ‘ఇక మీరు వంట ఎలా చేసుకుంటారు? మీ పిల్లలు బడికి ఎలా వెళ్తారు?’ అని వారిని భయపెట్టారు. దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించి, తద్వారా మోదీకి చెడ్డపేరు తీసుకురావాలనేది వారి పథకం” అంటూ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీకి తాను కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
“యుద్ధం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, రైతులకు ఎరువుల కొరత లేకుండా మోదీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు బాగా పెరిగాయి. కానీ, ఆ భారం రైతులపై పడకుండా ప్రభుత్వం చూసుకుంది” అని ఆయన చెప్పారు. “మన రైతులు సాధికారత సాధించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో దేశం ఈ మద్దతును అందిస్తుంది. అనిశ్చితితో నిండిన నేటి ప్రపంచంలో, భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధి ప్రపంచానికి కొత్త ఆశను కల్పిస్తోంది. నా జీవితంలోని చివరి క్షణం వరకు నేను మీ సేవలోనే ఉంటాను” అని ఆయన భరోసా ఇచఃరు.
అంతకుముందు, ప్రధానమంత్రి సభ జరిగే ప్రాంతానికి వెళ్లే మార్గంలో రోడ్‌షో నిర్వహించగా, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘మోదీ ఎక్కడికీ వెళ్లరు’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 24వ విడతలో సుమారు రూ.19 వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆ నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9.34 కోట్లమంది రైతులు లబ్ధిపొందారు.

More Stories
కక్షలోకి దూసుకుపోయిన ఎన్వీఎస్-03 ఉపగ్రహం
నవంబర్ 1న 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు నిరసన
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు జైలులోనే ముప్పు!