వంద శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతి ఇచ్చినట్లయితే, వాటికి ఇంధన సరఫరా ఎలా చేస్తారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్టోబర్ 26న రహదారి రవాణా మంత్రిత్వ శాఖ 1989 నాటి కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులు ప్రకటించింది. దీని ప్రకారం ఈ100 (దాదాపు స్వచ్ఛమైన ఇథనాల్) ఇంధనంతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు కేంద్రం అనుమతించింది.
అయితే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ప్రస్తుత 20 శాతానికి మించి పెంచే తక్షణ ప్రణాళిక కేంద్రానికి లేదని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అక్టోబర్ 27న తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ రెండు విభిన్న ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది.
ఈ అంశంపై ఇటీవల వచ్చిన మీడియా కథనాలను జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది. మంగళవారం కొన్ని వార్తాపత్రిక కథనాలు చూశాం. 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతి ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. సైద్ధాంతికంగా అడుగుతున్నాం. 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతి ఇస్తే, సరఫరా ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది.
దీనికి అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి స్పందిస్తూ ఇందుకోసం భారీ స్థాయిలో తయారీ వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. విచారణ సందర్భంగా దేశంలోని రైతులను బలోపేతం చేయడంపై ధర్మాసనం దృష్టి సారించింది. విస్తృత ప్రజా ప్రయోజన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, రైతులను బలోపేతం చేయాల్సి ఉంటుందని, పర్యావరణ కోణంలోనూ ఈ విషయాన్ని పరిశీలించాలని పేర్కొంది.
ఈ అంశంపై తన వాదనల్లో రైతులకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తానని వెంకటరమణి తెలిపారు. విచారణలో హాజరైన న్యాయవాదుల్లో ఒకరు ఇథనాల్‌ను ప్రోత్సహించడం వల్ల రైతులకు ఏదో ఒక రూపంలో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే నెలకు వాయిదా వేసింది.

More Stories
డిజిటల్ అరెస్ట్ బాధితులకు బ్యాంకులే పరిహారం చెల్లించాలి
ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కడివో ఉద్యోగులే చెప్పాలి!
దుర్గా పూజ పాస్ కేసులో మాజీ మంత్రి ఇంద్రనీల్ సేన్ అరెస్ట్