డిజిటల్ అరెస్ట్ బాధితులకు బ్యాంకులే పరిహారం చెల్లించాలి

దేశంలో వెలుగుచూస్తోన్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ ప్రచారాలు, మీడియా కథనాలు, కోర్టు ఉత్తర్వులు ఇన్ని ఉన్నప్పటికీ విద్యావంతులు కూడా ఎలా మోసపోతున్నారో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్ట్‌ మోసాలపై సుమోటోగా విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
 
‘‘ఈ బాధితులకు ఏమైంది? వీళ్లు ఇలా ఎలా చిక్కుల్లో పడుతున్నారు? ఈ ప్రాథమిక విషయం కూడా వాళ్లకు అర్థం కావడం లేదా? మొబైల్‌లో అరెస్టు చేస్తారేమోనని భయమెందుకు?’’ అని సీజేఐ ప్రశ్నించారు. ‘‘మొబైల్‌ను గోడకు కొడితే అరెస్టు పోతుంది కదా? మనుషుల్లో ఏదో లోపం ఉంది. అందులో ఏముందో దేవుడికే తెలియాలి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ మొబైల్ ఫోన్‌లో అరెస్ట్ అవ్వడమేంటి?’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. 
 
‘‘ఈ వయస్సులో మీరు డిజిటల్‌గా అరెస్ట్ అయితే రాబోయే తరానికి ఏం పాఠాలు నేర్పుతారు? అసలు నిజంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు కదా?’’ అని ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గతవారం ఓ మహిళ డిజిటల్ అరెస్ట్‌ మోసంతో రూ.2.5 కోట్లు పోగొట్టుకున్న విషయాన్ని అమికస్ క్యూరీ ఎన్.ఎస్. నప్పినాయ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడుతున్న బాధితులకు బ్యాంకులు రక్షణ కవచంగా నిలవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రిటైర్డ్ వ్యక్తుల ఖాతాల నుంచి అనూహ్యంగా పెద్ద మొత్తంలో నగదు డ్రా అవుతుంటే బ్యాంకులు సకాలంలో ఎందుకు స్పందించి నిరోధించడం లేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం ప్రశ్నించింది.
అయితే అనుమానిత లావాదేవీల‌ను బ్యాంకులు గుర్తిస్తున్నాయ‌ని, నేరాల జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ ఆర్ వెంక‌ట‌ర‌మ‌ణి కోర్టులో తెలిపారు. ప్ర‌జ‌ల‌తోనే ఏదో త‌ప్పు ఉంద‌ని, దేవుడికే ఆ విష‌యం తెలియాల‌ని, మీకు మీరు బాధితుల‌వుతున్నార‌ని, విద్యావంతులు ఫ్రాడ్‌కు గుర‌వుతున్నార‌ని తెలుసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని సీజేఐ పేర్కొన్నారు.

బ్యాంకులు సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల మోసం జరిగిందని విచారణ తేలితే, ఆ బాధితుడికి జరిగిన నష్ట పరిహారాన్ని పూర్తి స్థాయిలో సదరు బ్యాంకే చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, సంబంధిత బ్యాంకులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

 

About The Author