ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నుంచి ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌లకు సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చేసింది. డీపీఆర్‌ల తయారీకి కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఏపీఏడీసీఎల్ (రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది.
కుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్‌ల కోసం రక్షణ మంత్రిత్వశాఖ, డీజీసీఏ, ఏఏఐ, మిగిలిన కేంద్ర ప్రభుత్వ సంస్థల మార్గదర్శకాలకు లోబడి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక అటవీ, పర్యావరణ, వాతావరణశాఖల నుంచి ఎన్వోసీ పొందాలి. థర్డ్ పార్టీ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ రిపోర్టు, నెట్ జీరో కోసం తీసుకునే చర్యలు డీపీఆర్, ఎయిర్‌పోర్టుల మాస్టర్ ప్లాన్‌లో చేర్చాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన అడుగులు పడ్డాయి.
కుప్పంలో మొత్తం 1,788 ఎకరాల్లో విమానాశ్రయాన్ని ప్లాన్ చేశారు. ఇప్పటికే 1,300 ఎకరాలు సేకరించారు. తొలిదశలో రూ.734 కోట్లను క్యాపెక్స్ విధానం కింద ఖర్చు చేయనున్నారు. కుప్పం ఎయిర్‌పోర్టును బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో బండ్లింగ్ చేయించాలని అధికారులు ప్లాన్ చేశారు. దీని కోసం ఏఏఐకి ప్రతిపాదనలు త్వరలోనే పంపించనున్నారు. ఇటు శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ కోసం తొలిదశలో రూ.392 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏఏఐ భాగస్వామ్యంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను చేపట్టనుండగా, ఈ మేరకు రాయితీ ఒప్పందాన్ని ఏఏఐ పరిశీలనకు పంపించారు. ఈ ఎయిర్పో్ర్ట్ కోసం 1,185.86 ఎకరాలు గుర్తించారు.
ఈ రెండు విమానాశ్రయాలు మాత్రమే కాకుండా అమరావతిలో ప్రతిపాదించి న విమానాశ్రయంకు కూడా రెండు నెలల్లో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈలోపు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను పీపీపీ-డీబీఎఫ్ ఓటీ విధానంలో నిర్మించాలని భావిస్తున్నారు.

More Stories
జగన్ సీబీఐ, ఈడీ కేసులో ఇక రోజువారీ విచారణ
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ 129.85 కోట్ల ఆస్తుల జప్తు
గుర్తింపు అడిగినందుకు బెంగుళూరు పబ్ లో ఏపీ ఐఏఎస్ దూషణలు!