కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తలు.. పులివెందులలో గాల్లోకి  6 రౌండ్ల కాల్పులు!

స్ధానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కడప జిల్లాలోని పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌ కేంద్రం దగ్గర కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.
 
ఇరువర్గాలూ నామినేషన్ కేంద్రం దగ్గరకు దూసుకొచ్చాయి. రెండూ వర్గాలూ రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల పైకి దూసుకురావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు జరిపారు. లాఠీచార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతుండగా టీడీపీ అభ్యర్థి నామపత్రాలు దాఖలు చేసేందుకు కార్యాలయానికి వచ్చారు. 
 
ఆయన నామపత్రాలు దాఖలు చేసి బయటకు రాకముందే వైఎస్సార్సీపీ అభ్యర్థి కార్యకర్తలతో కలిసి నామినేషన్‌ వేసేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి బయటకు వచ్చిన తర్వాత లోపలికి పంపిస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు తెలిపారు. అయినా వారు వినకుండా తాము లోపలికి వెళ్లితీరాల్సిందేననని పట్టుబట్టారు. ఈ క్రమంలో భద్రతగా ఉన్న పోలీసులపైకి దూసుకెళ్లడంతో పాటు వారిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. 
 
దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.  అలాగే, పోలీసులు టియర్‌ గ్యాస్‌‌ను ప్రయోగించారు. ఇరు పార్టీల శ్రేణులను నామినేషన్ కేంద్రం నుంచి దూరంగా పంపించి వేశారు. ఈక్రమంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆ తర్వాత ఆ పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గారు. కాగా, కడపలోని కాగితాలపెంట నామినేషన్‌ కేంద్రం వద్ద గాంధీనగర్‌ పాఠశాల వద్ద, రాజంపేటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు.నాగరాజుపేట, సెయింట్‌ జోసెఫ్‌ నామినేషన్‌ కేంద్రాల్లో , ఘర్షణ చోటు చేసుకుంది.
 
రాజంపేటలో  టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.  టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి రాళ్లదాడికి పాల్పడడంతో, ప్రతీకారంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్​నాథ్​రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇంటి అద్దాలతో పాటు కారు, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడపలోని కాగితాలపెంట నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గాంధీనగర్‌ పాఠశాల వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. నాగరాజుపేట, సెయింట్‌ జోసెఫ్‌, రాజంపేట నామినేషన్‌ కేంద్రాల్లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు మైదుకూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ – టీడీపీ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు.
కడప జిల్లాలో ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అంజాద్ బాషాను అదుపులోకి తీసుకున్నారు.   రాయచోటిలో ఇరువర్గా ఘర్షణలో కారు ధ్వంసమయ్యింది. పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో వైసీపీ మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ తరఫున నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.  నామినేషన్‌ వెళ్లే ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించకపోవడం పోలీసు యంత్రాంగం వైఫల్యమని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.
తిరుపతిలో ఈనాడు రిపోర్టర్‌పై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం సమీపంలో నామినేషన్ సమయంలో ఫోటోలు తీస్తుండగా ఈనాడు రిపోర్టర్ గంగాధర్‌శర్మపై దాడికి పాల్పడ్డారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఫోటోలు తీస్తుండగా రిపోర్టర్‌ ఫోన్‌ లాక్కొని కొట్టారు. గంగాధర్ శర్మ ఫోన్‌లోని ఫోటోలను టీడీపీ కార్యకర్తలు డిలీట్‌ చేసి తిరిగి ఇచ్చారు.
కాగా, స్థానిక ఎన్నికల నామినేషన్ల తొలిరోజు చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. నామినేషన్ల రోజు జరిగిన పలు ఘటనలపై రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశాయని వెల్లడించారు. సమస్యాత్మత ప్రాంతాల్లో మరింత పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. 

About The Author