జగన్ సీబీఐ, ఈడీ కేసులో ఇక రోజువారీ విచారణ

వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులలో రోజువారీ విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.  సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులనూ రోజువారీగా విచారణకు హాజరుకావాలని ఈడీ న్యాయవాదులకు సూచించింది. సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. జగన్ సహా 70 మంది నిందితుల కేసుల విచారణపై సిబిఐ కోర్టు దృష్టి సారించింది. 

జగన్‌పై కేసు 2004-2009 మధ్య, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించింది. జగన్‌ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి భూములు, గనులు, నీరు, ప్రాజెక్టులు, లైసెన్సులు వంటి లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీలు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టారని అభియోగాలున్నాయి. 

ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లు, దానిపై దాఖలైన డిశ్చార్జ్‌ పిటిషన్లపై మాత్రమే సీబీఐ న్యాయస్థానం రోజువారీ విచారణ చేస్తోంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో 2016 నుంచి 2021 వరకు ఈడీ 9 ప్రత్యేక ఛార్జిషీట్లు దాఖలు చేసింది.  ఈ ఛార్జిషీట్లపై విచారణతో పాటు వీటిపైనా జగన్‌ తదితరులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఈ పిటిషన్లు అన్నింటిపైనా రోజువారీ విచారణ జరిపి త్వరగా తేల్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ ఛార్జిషీట్లపై విచారణ సందర్భంగా జగన్‌ సహా నిందితులందరూ సీబీఐ కోర్టులో హాజరయ్యేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది.  తొమ్మిది ఛార్జిషీట్లపై పదేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉందని ఈడీ అసహనం వ్యక్తం చేసింది. 

ఆర్థిక నేరాలను ప్రత్యేక దృష్టిలో చూడాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఈడీ గుర్తుచేసింది. ఈడీ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా తాజాగా సీబీఐ న్యాయస్థానమే ఈడీ ఛార్జిషీట్లు, డిశ్చార్జ్‌ పిటిషన్లపై రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది.

సీబీఐ మొత్తం 11 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిలో 120 మందికి పైగా నిందితులు, 861 మంది సాక్షులు ఉన్నారు. ఈడీ కేసులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్లు తేలలేదు. ఇవి తేలితేనే ట్రయల్ మొదలవుతుంది. సీబీఐ అఫిడవిట్ ప్రకారం, ట్రయల్ కోర్టులో 86, హైకోర్టులో 27, సుప్రీంకోర్టులో 12 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 

12 ఏళ్లలో 8 మంది జడ్జిలు బదిలీ అయ్యారు. ప్రతిసారీ విచారణ మళ్లీ మొదటి నుంచి మొదలవుతోంది. అన్ని కేసుల్లోనూ జగన్ నిందితుడు కాబట్టి, అన్ని కేసుల్లో ఒకేసారి వాదనలు వినిపిస్తామని జగన్, విజయసాయి రెడ్డి కోరారు. దీంతో విచారణ మరింత ఆలస్యం అయింది. ఇప్పటివరకు ఏ కేసులోనూ తుది తీర్పు రాలేదు. ఇవన్నీ ఇంకా ఆరోపణల దశలోనే ఉన్నాయి. 

About The Author