మార్కెట్లో విసృ్తంగా లభిస్తున్న ‘అనలాగ్’ అనగా కృత్రిమ పన్నీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిషేధం సరిగ్గా ఏడాది పాటు రాష్ట్రంలో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. తక్కువ ధర, ఎక్కువ నిల్వ సామర్థ్యం కారణంగా కొన్ని వాణిజ్య సంస్థల్లో వినియోగించే అనలాగ్ పన్నీర్‌ను అసలైన పాల పన్నీర్‌గా విక్రయించకుండా చర్యలు తీసుకోవడమే ఈ నిర్ణయం లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
అసలు పన్నీర్ ముసుగులో విక్రయిస్తున్న నాణ్యత లేని, ప్రమాదకరమైన కల్తీ ఉత్పత్తుల వల్ల పౌరుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. మార్కెట్లో కేవలం పన్నీర్ పేరుతో చలామణి అవుతున్న డైరీయేతర, కృత్రిమ ఉత్పత్తులకు సంబంధించి అన్ని రకాల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు.
ఈ కృత్రిమ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, నిల్వ చేయడం, రవాణా, పంపిణీ అలాగే బహిరంగ విక్రయాలపై ఈ నిషేధం పూర్తిగా వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్) నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు 2026 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 30(2)(a) నిబంధనల ప్రకారం ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగం నుంచి వెలువడిన ఈ కఠినమైన ఉత్తర్వులతో ఇకపై రాష్ట్రంలో అనలాగ్, కల్తీ పన్నీర్ తయారీ, విక్రయాలకు గట్టి అడ్డుకట్ట పడనుంది. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా విక్రయాలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని డెయిరీల్లో అనలాగ్ పనీర్ను తయారు చేస్తున్నారు. దీన్ని నగరంలో పలు రెస్టారెంట్లు, హోటళ్లు, స్ట్రీట్ సైడ్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న టీజీసేఫ్ ఇటీవల నగరంలో 14 పనీరు, డెయిరీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

More Stories
ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
బొల్లారం రెజిమెంట్ లో చోరీ ఆయుధాలు స్వాధీనం
మహేశ్ బాబు, రాజమౌళి, సమంతలకు ఎస్ఐఆర్ నోటీసులు