తెలంగాణలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక పోలింగ్ సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యాయి. ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచిన పేర్లు, వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఎన్నికల అధికారులు విచారణ నిమిత్తం నోటీసులు పంపారు.
ఈ జాబితాలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, సీనియర్ నటుడు వెంకటేశ్, సమంత, విజయ్ దేవరకొండ, అలాగే క్రీడా రంగానికి చెందిన వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్, ఉపాసన కొణిదెల వంటి ప్రముఖులు ఉన్నారు.
‘నోటీసులు జారీ చేసిన వ్యక్తుల జాబితా’ (17-08-2026న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత) పరిశీలించగా, అందులో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, మిథాలీ రాజ్, నటులు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, వెంకటేష్ దగ్గుబాటి, ఆయన ఇద్దరు కుమార్తెలు, సమంత, విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్, రవితేజ, సుమ కనకాల, నందిని రెడ్డి, ప్రియదర్శి తదితరులు ఉన్నట్లు గుర్తించారు.
విచారణ రోజున, ఓటరు నిర్ణీత కేంద్రానికి హాజరై సంబంధిత పత్రాలను వెంట తీసుకువెళ్లాలి. ఆ కేంద్రంలో, బూత్ స్థాయి అధికారి (బిఎల్ఓ) ఓటరు వివరాలను ‘బిఎల్ఓ వెరిఫికేషన్ సర్టిఫికేట్’, ‘స్పీకింగ్ ఆర్డర్’లో నమోదు చేస్తారు. ఈ ధృవీకరణ ప్రక్రియలో బిఎల్ఓ ఓటరు కలిసి ఉన్న సెల్ఫీ ఫోటోను తీసుకోవడం కూడా ఒక భాగంగా ఉంటుంది. ఆ తర్వాత, బిఎల్ఓ సమర్పించిన పత్రాలను ఫోటో తీసి, ఆ సమాచారాన్ని భారత ఎన్నికల సంఘం అధికారిక యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
సాధారణ ఓటర్ల మాదిరిగానే విచారణ ప్రక్రియకు ప్రముఖులు కూడా సహకరించాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయితే, షూటింగ్‌లు, క్రీడా ప్రాక్టీస్ లేదా ఇతర వ్యాపార కార్యక్రమాల వల్ల సదరు విఐపీలు స్వయంగా విచారణకు అందుబాటులో లేకపోతే, తమ తరఫున మరొకరికి అధికారాన్ని ఇచ్చి విచారణకు పంపవచ్చని అధికారులు స్పష్టం చేశారు. సమర్పించిన ధ్రువీకరణ పత్రాల్లోని తప్పులను సవరించుకుని, సరైన ఆధారాలు చూపిస్తేనే ఓటరు జాబితాలో వారి ఓటు భద్రంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

More Stories
సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’
పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ అమానుషం
దళిత సమాజాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్