అమెరికా, సింగపూర్‌లలో కేటీఆర్‌ పెట్టుబడులు?

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అమెరికా, సింగపూర్‌లలో పెట్టుబడులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మూడు దక్కన్‌ సెరాయ్‌ ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, ఎట్‌ హోమ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ కూడా కేటీఆర్‌వేనని పేర్కొన్నారు. ఆంధ్రావాళ్ల పేరుమీద ఉన్న ఈ రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు ఆరు నెలల కిందటే కేటీఆర్‌ పేరుమీదికి మారాయని తెలిపారు. 
 
మూడు దక్కన్‌ సెరాయ్‌ హోటళ్లు కేటీఆర్‌, ఆయన భార్య, అత్త పేరుమీద ఉన్నట్లు తాను నిరూపించలేకపోతే తన పేరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే ఆయన ఆస్తులతోపాటు కేసీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌రావు, ఆయన బంధువుల ఆస్తులపై శ్వేతపత్రం అడగాలని సవాల్‌ చేశారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
‘‘తండ్రీ కొడుకులం కలిసుండటానికి హైదరాబాద్‌లో యోగ్యమైన ఇల్లు లేక తన తండ్రి చెట్ల కింద, తాను నానక్‌రామ్‌గూడ రాళ్ల సందుల్లో బతుకుతున్నామన్నట్లుగా కేటీఆర్‌ మాట్లాడుతున్నడు. అవలీలగా అబద్ధాలు చెబుతున్నడు. జన్వాడ, శంకర్‌పల్లి, మొయినాబాద్‌లలోని కేటీఆర్‌, ఆయన చెల్లెలు, ఆయన బావ ఫాంహౌస్‌లు, ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌస్‌ సరిపోకపోతే హైటెక్‌ సిటీ పక్కన ఉన్న దక్కన్‌ సెరాయ్‌ హోటల్లో కలిసుండొచ్చు కదా?’’ అని రేవంత్‌ చెప్పుకొచ్చారు. 

‘‘కేటీఆర్‌కు వందల ఎకరాల భూములు, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌లో బంగళాలు ఉన్నాయి. అమెరికా, సింగపూర్‌లలో పెట్టుబడులూ ఉన్నాయి. ఒకనాటి దుబాయి పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌ కొడుక్కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్ల వచ్చినయి? సిరిసిల్ల నుంచి దుబాయికి వెళ్లిన కార్మికుల బతుకులు ఎట్లున్నయి? సిరిసిల్ల ఓట్లు పచ్చనోట్లుగా మారి వేల కోట్ల విలువైన ఆస్తులు ఎట్ల వచ్చినవో ఒక్కసారి ఆలోచన చేయండి’’ అంటూ సిరిసిల్ల ప్రజల్ని ఉద్దేశించి రేవంత్‌ పేర్కొన్నారు. 

కేటీఆర్‌ను భజాన మోసిన ఈ ప్రాంత ప్రజల బతుకులు అట్లాగే ఉన్నాయని, చేనేత కార్మికుల బతుకులు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే ఇక్కడి నుంచి గెలిచిన బిడ్డ క్యాబినెట్లో మంత్రి అయి వస్తారని ప్రకటించారు. పెద్ద కొడుకులా తోడుండి కష్టాలు తీరుస్తారని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌, కేటీఆర్‌లకు గతమే తప్ప భవిష్యత్తు ఉండబోదని రేవంత్‌ జోస్యం చెప్పారు. సిరిసిల్లలో ఇక బీఆర్‌ఎస్‌ జెండా ఎగరబోదని, రాష్ట్రంలో 2034 వరకూ తమ ప్రజా పాలననే ప్రజలు అధికారంలో ఉంచుతారని ధీమా వ్యక్తం చేశారు.

 

About The Author