హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎవరికీ అనుమానం రాకుండా చాక్లెట్ల రూపంలో డ్రగ్స్‌ను మార్చేసి లగేజీలో తీసుకువస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన సుమారు 5 కిలోల కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా కొనసాగిస్తున్న డీఆర్ఐ అధికారులకు అందిన సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దోహా నుంచి శంషాబాద్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంతో సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అతని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
సాధారణ వస్తువుల మధ్య దాచిన అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించిన అధికారులు వాటిని పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా చాక్లెట్ల మాదిరిగా కనిపించేలా కొకైన్‌ను ప్యాక్ చేసి లగేజీలో ఉంచినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అవి ఓపెన్ చేయగానే మొదట సాధారణ ఆహార పదార్థాలుగా కనిపించేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
తనిఖీల్లో బయటపడిన పదార్థాలను పరీక్షించిన అనంతరం అధికారులు వాటిని కొకైన్‌గా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కొకైన్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? హైదరాబాద్ మీదుగా ఎక్కడికి తరలించేందుకు ప్రయత్నించారు? ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారంలో హైదరాబాద్ కేవలం ట్రాన్సిట్ పాయింట్‌గా ఉపయోగించారా? అనే కోణాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ వ్యవహారానికి అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌తో సంబంధం ఉందా? అనే అంశంపైనా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ విమాన ప్రయాణాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కస్టమ్స్, డీఆర్ఐ, సీఐఎస్ఎఫ్ వంటి భద్రతా విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల లగేజీలపై అనుమానం వచ్చినప్పుడు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు.

More Stories
అమెరికా, సింగపూర్లలో కేటీఆర్ పెట్టుబడులు?
ప్రభుత్వ అసమర్ధతతోనే వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు
ఆదివాసుల సమస్యలపై సెక్రటేరియట్ ముందు ధర్నా