పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ అమానుషం

పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ అమానుషం
తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో జరిపించిన లాఠీచార్జ్, దాష్టీకాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన అని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థి లోకం గొంతు నొక్కేలా నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 
 
గతంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ బాటలోనే నేడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పయనిస్తూ, విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేసేలా అనాలోచితంగా జీవో 97ను తీసుకురావడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. డిప్లొమా విద్యార్థుల ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసే ఈ వివాదాస్పద జీవోను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కితే, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి పోలీసులతో అణచివేయాలని చూడటం దుర్మార్గం అని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు తాళ్లతో బంధించి, విచక్షణ లేకుండా తోసివేస్తూ లాఠీలతో దాడికి పాల్పడటం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణాన్ని ఒక యుద్ధక్షేత్రంలా మార్చి విద్యార్థులను కిందపడేసి గాయపరచడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు.

 
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండివైఖరిని వీడి, వేలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్న జీవో 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, విద్యార్థులపై దౌర్జన్యానికి దిగిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోకపోతే విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.