తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం దళిత సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దళితులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తూ, వారి ఆత్మగౌరవాన్ని, నాయకులను పదే పదే అవహేళన చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాయని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నామంటూ రాజ్యాంగబద్ధమైన శాసనసభ సభాపతి (స్పీకర్) స్థానంలో ఉన్న దళిత వర్గానికి చెందిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, దుర్భాషలాడటం వారి దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అలాగే, దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎదుట దళిత సంఘాలు డప్పుకొట్టి నిరసన వ్యక్తం చేస్తే వారు వెళ్లిన తర్వాత ఆ ప్రదేశంలో ‘శుద్ధి’ పేరుతో పసుపు నీళ్లు చల్లడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
వందేళ్ల క్రితం మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకుని తిరిగేలా అంటరానితనం నెరిపిన నాటి వివక్షాపూరిత ఆలోచనలనే నేడు బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఆత్మగౌరవంతో బతుకుతున్న దళిత సమాజాన్ని ఈ రకంగా అవమానించడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన విభాగం బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటమే కాకుండా, కార్యాలయంలో ఉన్న పూజ్య సంత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల పోస్టర్లపై నల్లరంగు పూసి తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడు సంత్ రవిదాస్ చిత్రపటాలపై నల్లరంగు రుద్దినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ దళిత వ్యతిరేక విధానాలనే ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగడుగునా దళితుల మనోభావాల దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడిని మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ ఒకవైపు ఉంటే, దళిత డిక్లరేషన్, దళిత భరోసా, సమగ్ర వికాసం అంటూ ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరోవైపు ఉన్నారని ఎద్దేవా చేశారు. దళితులను నమ్మించి గద్దెనెక్కిన ఈ ఇద్దరు నాయకులు దళిత సమాజానికి మొండిచేయి చూపించారని విమర్శించారు.

More Stories
ఈ సెషన్స్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్యెల్యేల సస్పెన్షన్
ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు
మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి తిరస్కరించిన శారద!