మాజీ సీఎం విజయన్, కుమార్తె, అల్లుడిపై అవినీతి కేసు

మాజీ సీఎం విజయన్, కుమార్తె, అల్లుడిపై అవినీతి కేసు
 
*  మనీలాండరింగ్ కేసు నమోదు చేయాలని డిజిపిని కోరిన ఇది 
 
కేరళ రాజకీయాలలో కొంతకాలంగా కలకలం రేపుతున్న కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటిల్ లిమిటెడ్‌ (సీఎంఆర్ఎల్) కేసులో మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ టి, అల్లుడు పి.ఎ. మహమ్మద్ రియాస్లతో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేరళ డీజీపీకి లేఖ రాసింది. 
 
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం, జరిపిన సోదాలు, దర్యాప్తులో లభించిన సాక్ష్యాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేరళకు చెందిన మైనింగ్ సంస్థ ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థ’, గతంలో వీణాకు చెందిన ‘ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌’కు ఐటీ కన్సల్టెన్సీ సేవల పేరుతో రూ.2.73 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిపినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 
 
రాజధాని తిరువనంతపురంలో విజయన్, వీణ నివాసంలో జూన్ నెలలో సోదాలు నిర్వహించి, అనంతరం విచారణ చేపట్టింది. వీణ నివాసంలో జరిపిన సోదాల్లో కొన్ని చేతిరాత పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో దుబాయ్‌కి జరిగిన కొన్ని నిధుల బదిలీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని ఈడీ ఆగస్టులో ఒక ప్రకటనలో తెలిపింది.

2023 ఆగస్టులో ఆ అంశం వెలుగులోకి వచ్చింది. రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ, అవి మోసపూరితంగా ఉన్నాయని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) అభియోగాలు నమోదు చేసింది. 2017 నుంచి 2020 మధ్యలో సీఎంఆర్‌ఎల్ నుంచి రూ.1.72 కోట్లు పొందినట్లు ఆ ఆరోపణల సారాంశం. సీఎంఆర్ఎల్ తన 15 ఏళ్ల కాలంలో దాదాపు రూ.182 కోట్ల మేర కల్పిత నగదు ఖర్చులు చూపించి వివిధ వ్యక్తులకు లంచాలు ఇచ్చినట్లు ఎస్ఎఫ్ఐఓ ఆరోపించింది. అలాగే సీఎంఆర్ఎల్ ప్రమోటర్‌ ఎస్‌.ఎన్‌. శశిధరన్‌ కర్త, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు రవాణా సేవల పేరుతో రూ.91 కోట్లు చెల్లించినట్లు అందులో పేర్కొంది.

ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఎస్‌ఎఫ్‌ఐఓకు కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ కేసు విషయంలో వీణపై ఈడీ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసింది. గతంలో, 2012-13 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య సీఎంఆర్ఎల్ తన ఖర్చులను రూ.133.82 కోట్ల మేర పెంచి చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

రవాణా, వ్యర్థాల నిర్వాహణ పేరిట ఖాతాల్లో బోగస్‌ నగదు ఖర్చులు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాదు, ఈ విధంగా సృష్టించిన నగదును రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమ చెల్లింపుల కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, అలాగే సంస్థ మూసివేత, పర్యావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందకు ఇటువంటి నగదు చెల్లింపులు చేసినట్లు సీఎంఆర్ఎల్ సీఎఫ్‌ఓ, ఎండీ ఆదాయపు పన్ను అధికారుల ఎదుట అంగీకరించినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. కాగా, తన కుమార్తెపై ఈడి కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా విజయన్‌ గతంలో అభివర్ణించారు. ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని రియాస్‌ కూడా గతంలో పేర్కొన్నారు.