‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో సహా 270 కోట్లకు పైగా ప్రజలు పరోక్ష ధూమపానానికి గురయ్యారు, దీనివల్ల 2023లో దాదాపు 17 లక్షల మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకు పొగాకు ఒక ప్రధాన కారణంగానే మిగిలి ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. 2023లో ధూమపానం సంబంధిత అనారోగ్యాలతో మరణించిన మొత్తం 80 లక్షల మందిలో, పరోక్ష ధూమపానానికి గురైన ధూమపానం చేయని వారు కూడా చాలా మంది ఉన్నారని ఈ అధ్యయనం తెలిపింది.
పొగాకు పొగ బారిన పడే జనాభా మొత్తం శాతం తగ్గినప్పటికీ, దానికి గురయ్యే భారతీయుల సంఖ్య పెరగడం ఈ అధ్యయన ఫలితాల్లోని అత్యంత ఆందోళనకరమైన అంశం.
ఈ అధ్యయనం ప్రకారం, భారత్‌లో పరోక్ష ధూమపాన మరణాలు 1990తో పోలిస్తే 2003 నాటికి 50శాతం మేరకు పెరిగాయి. 2023లో భారత్‌లో 44.4 కోట్ల మంది పరోక్ష ధూమపానానికి గురైనట్లు ప్రపంచవ్యాప్త విశ్లేషణ వెల్లడించింది. ఆరోగ్యపరంగా పిల్లలకు ఇది గణనీయమైన ముప్పును కలిగిస్తున్నది.
1990లో పరోక్ష ధూమపానానికి గురైన వారి సంఖ్య 37.5 కోట్లుగా ఉండగా, 2023 నాటికి అది 44.4 కోట్లకు పెరిగిందని లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన విశ్లేషణ తెలియజేసింది. అంటే, ఈ కాల వ్యవధిలో పొగాకు పొగ బారిన పడే వారి సంఖ్యలో దాదాపు 18.4% పెరుగుదల నమోదైంది. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్'(జీబీడీ) 2023 సెకెండ్ హ్యాండ్ స్మోక్ కొలాబరేషన్’గా ఏర్పడిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం 204 దేశాల్లో పరోక్ష ధూమపానానికి గురయ్యే స్థాయి, దాని వల్ల కలిగే వ్యాధుల భారాన్ని అంచనా వేసింది.
భారత్‌లో 1990లో పరోక్ష ధూమపానం కారణంగా నమోదైన మరణాలు 2,17,700 కాగా, 2023లో అవి 3,25,600కు పెరిగాయి. పరోక్ష ధూమపానానికి గురికావడం వల్ల గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు సహా పలు వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యురాలు నీతూజైన్ ఓ వార్తాసంస్థకు తెలిపారు.
ఈ ప్రభావం వల్ల 16.6 లక్షల మంది అకాల మరణాలు సంభవించాయని, అలాగే గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాకపోవడం వల్ల వచ్చే ఇస్కీమిక్ గుండె జబ్బు వంటి అకాల వైకల్యాలు, అనారోగ్యాలు కలుగుతున్నాయని అంచనా.
పిల్లలలో, పరోక్ష ధూమపానానికి గురికావడం వల్ల 2023లో 52 లక్షల శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు సంభవించాయని అంచనా వేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. పొగ తీస్తున్న వ్యక్తికి సమీపంలో ఉన్నవారు, కాలుతున్న పొగాకు నుండి వెలువడే “సైడ్‌స్ట్రీమ్ స్మోక్”తో పాటు, ధూమపానం చేసే వ్యక్తి వదిలే పొగకు కూడా గురవుతారని ఆ అధ్యయనం వివరించింది.
1990 నుండి ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, జనాభా పెరుగుదల, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలలో దీని ప్రభావం పెరగడం వల్ల, పరోక్ష ధూమపానానికి గురయ్యే వారి సంఖ్య స్థిరంగానే ఉంది. ముఖ్యంగా మహిళల్లో ధూమపానం తక్కువగా ఉన్న ప్రాంతాలలో, పరోక్ష ధూమపాన ప్రభావం మహిళలపై అసమానంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది.
పరోక్ష ధూమపానం నుండి మహిళలు, పిల్లలను మరింత మెరుగ్గా రక్షించడానికి, బహిరంగ ప్రదేశాలు, గృహాలలో కఠినమైన పొగాకు నియంత్రణలను అమలు చేయాలని ఈ అధ్యయనం ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.

More Stories
భారత్ 7.8% జీడీపీ వృద్ధి ప్రపంచానికి కొత్త ఆశ
మాజీ సీఎం విజయన్, కుమార్తె, అల్లుడిపై అవినీతి కేసు
ఐరాస కొత్త మ్యాప్‌లో ప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్, అక్సాయ్ చిన్