రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్, వరంగల్ -ఖమ్మం -నల్గొండ రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్నల పదవీ కాలం 2027 మార్చి 29తో ముగియనుంది.
ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం (సెప్టెంబర్ 28) రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓట్ల నమోదు కోసం ఎ న్నికల కమిషన్ పబ్లిక్ నోటీసు ఇవ్వనుంది. సోమవారం నుంచే ఫారం -18 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. నవంబరు 6 వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరించి, నవంబర్ 25న ముసాయిదా ఓటరు జా బితా విడుదల చేయనున్నారు.
నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు స్వీకరించి, డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. పాత జాబితాలో పేరు ఉన్నవారు కూడా ఫారం—18తో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 1వ తేదీ నాటికి మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసినవారంతా అర్హులే. దరఖాస్తుతో పాటు డిగ్రీ పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు కూడా జతపరచాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
అర్హత కలిగిన పట్టభద్రులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వస్తున్న తొలి కీలక పట్టభద్రుల ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎలాగైనా రెండు స్థానాలను చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
మరోవైపు, క్షేత్రస్థాయిలో తమ పట్టును చాటుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న ఉత్సాహంతో బిజెపి సైతం పట్టభద్రుల పోరును సీరియస్‌గా తీసుకుంటున్నది. త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. ప్రధాన పార్టీలు ఎన్నికలు జరగనున్న ఆరు జిల్లాల పరిధి నుంచి ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఆశావహులు ఆయా పార్టీల నుంచి దక్కించుకునేందుకు అధిష్ఠానం వద్ద తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని పివి నర్సింహారావు కుమార్తె సురభి వాణి దేవి మరోసారి పోటీకి విముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని బిఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ఆయా జిల్లాల ముఖ్యనేతల నుంచి పేర్లను సేకరిస్తున్నారు.
అలాగే నల్గొండ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా బిజెపి అభ్యర్థిగా హైదరాబాద్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఆయన గతంలో ఈ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికలలో ఓటమి చెందారు.

More Stories
రాష్ట్ర హోదా కోరిన కాశ్మీర్ అసెంబ్లీ.. బీజేపీ సభ్యుల వాకౌట్
శీతాకాలం ఢిల్లీలో పార్కింగ్ ఫీజ్ రెట్టింపు, నిర్మాణాలు బంద్
భట్టి ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్ల బకాయిల పోరు!