జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీని ప్రకారం ఆపరేషన్ అష్దర్ పేరుతో జమ్మూ కాశ్మీర్‌లో తాజా ఆపరేషన్ ప్రారంభమైంది. బుద్గాం జిల్లా, అష్దర్ గాలి ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది.
దీంతో అనుమానాస్పద ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా శుక్రవారం సోదాలు ప్రారంభించారు. ఆపరేషన్ అష్దర్ పేరుతో తనిఖీ, భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భారత భద్రతా బలగాలు కూడా వారిపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఏకే రైఫిల్, కొన్ని ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, అదే అటవీ ప్రాంతంలో మరో ఉగ్రవాది దాగి ఉన్నాడని భావిస్తున్నందున, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నాయి. అనుమానిత ఉగ్రవాది ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్నప్పుడు దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది గుర్తింపు ఇంకా నిర్ధారించ లేదు. శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్, ఒక `ఎక్స్’ పోస్ట్‌లో ఈ ఆపరేషన్‌ను ధృవీకరించింది.
“నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, బుద్గాంలోని అష్దర్ గలిలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అప్రమత్తంగా ఉన్న దళాలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి. వారు సవాలు చేయడంతో, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఇరువైపులా భీకర కాల్పులు జరిగాయి, ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చగా, ఒక ఏకే రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు” అని వివరించారు.
బుద్గాం జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుందని ఇక్కడ గమనించాలి. పుల్వామా జిల్లాలోని పఖేర్‌పోరా నుంచి బుద్గాం జిల్లాలోని యూస్‌మార్గ్ వైపు అనుమానిత ఉగ్రవాదుల బృందం కదులుతున్నట్లు సమాచారం అందడంతో గురువారం ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతం దూద్‌పత్రి సమీపంలో ఉన్నందున, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆ పర్యాటక ప్రదేశాన్ని సందర్శించవద్దని అధికారులు పర్యాటకులను కోరారు.

More Stories
ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక వేధింపులపై ఎన్హెచ్ఆర్సి
‘సర్’ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల తొలగింపు
విజయవంతంగా స్వదేశీ ఖగంటక్-243 గ్లైడ్ బాంబు ప్రయోగం