ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరీష్ కథ్‌పాలియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కేవలం ఒక మహిళకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. స్వయంగా దేశ ప్రధానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో వారు స్పందించకపోతే, స్పందించేలా చేయడం నాకు తెలుసు’’ అని జస్టిస్ కథ్‌పాలియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫేస్-స్వాపింగ్ సాంకేతికతను ఉపయోగించి తన ఫొటోను దుర్వినియోగం చేశారని సదరు మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐ సహాయంతో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో తన ఫొటోను జోడించి మార్ఫింగ్ చేశారని ఆమె ఆరోపించారు.
ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోను నిరసన వేదిక వద్ద పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లపై ఉపయోగించడమే కాకుండా అసభ్యకరమైన నినాదాలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆ వీడియోను వైరల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీజేపీ నేతలు అభీజీత్ దిప్కే, సౌరభ్ దాస్‌లతో పాటు ఇతరులపై ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లో వీరి పేర్లను కాకుండా ‘అపరిచిత వ్యక్తులు’ అని పేర్కొన్నారు.
జూన్ 20న సీజేపీ నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆందోళన నెల రోజులకుపైగా కొనసాగింది. ఈ ఉద్యమంలో భాగంగా చలో పార్లమెంట్ సమయంలో నిరసనకారులు, భద్రతా దళాల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొనగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో జులై 25న ఈ ఆందోళన విరమించారు.

More Stories
శబరిమలలో బంగారు కిరీటం భద్రంగా ఉంది
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంలో భిన్నాభిప్రాయం
కావేరి నదీ జలాల వివాదంలో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోలేవు