తెలంగాణలో మహిళలకు రక్షణ కరువు

తెలంగాణలో మహిళలకు రక్షణ కరువు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు భద్రత పూర్తిగా గాలిలో దీపంగా మారిందని, శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులను నిరసిస్తూ శుక్రవారం రాజ్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. 
 
ఈ బృందంలో బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ మేకల శిల్పారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 28న తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ ఆసుపత్రిలో నర్సుగా సేవలందిస్తున్న గిరిజన యువతిపై మహమ్మద్ సనావుల్లా ఖాన్ అనే దుర్మార్గుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘోర ఉదంతాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 
 
తండ్రి లేని నిరుపేద కుటుంబంలో ఆ అమ్మాయి సంపాదనే ఏకైక ఆధారంగా బతుకుతున్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బాధితురాలి తల్లికి గానీ, సోదరుడికి గానీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించి పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడైన మహమ్మద్ సనావుల్లా ఖాన్‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరారు.

అలాగే నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఇంట్లో లేని సమయం చూస స్థానిక కాంగ్రెస్ మేయర్, ఆయన అనుచరులు రౌడీ మూకలతో కలిసి వారి ఇంట్లో చొరబడి దాష్టీకానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు, వృద్ధురాలైన వర్షిత్ రెడ్డి తల్లిగారిపై భౌతిక దాడికి దిగడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. 

 
దాడికి సంబంధించిన స్పష్టమైన సీసీటీవీ ఆధారాలు ఉన్నప్పటికీ, స్వయంగా బాధితురాలు ఫిర్యాదు చేసినా అధికార పార్టీకి చెందిన మేయర్ అనే కారణంతో పోలీసులు ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాలు సృష్టించిన భయాందోళనల వల్ల వర్షిత్ రెడ్డి తల్లిగారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై గుండెపోటు రావడంతో ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారని తెలిపారు. 
 
ఈ దాడికి కారకులైన కాంగ్రెస్ మేయర్, ఆయన రౌడీ మూకలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని గవర్నర్ ను కోరారు.   హోం శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మహిళలపై నేరాల రేటు దాదాపు రెట్టింపు అయిందని శిల్పారెడ్డి విమర్శించారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి ఏకంగా 24,945 కేసులు నమోదు కావడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని చెబుతూ ఇందులో 5,940 లైంగిక దాడులు, 2,945 అత్యాచారాలు, 3,145 పోక్సో కేసులు, 1,735 మైనర్ల అపహరణ కేసులు ఉండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని స్పష్టం చేశారు. మైనర్లపై నేరాల విషయంలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో, మహిళలపై డిజిటల్ వేధింపులలో దేశంలోనే 4వ స్థానంలో నిలవడం సిగ్గుచేటని తెలిపారు.

ఓటు బ్యాంకు, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసమే ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లి మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే కౌన్సిలింగ్, రాజీ పేరిట కాలయాపన చేస్తున్నారే తప్ప దోషులను శిక్షించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 
రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, షీ టీమ్స్ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మహిళా వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ బాలికల హాస్టళ్లలో కట్టుదిట్టమైన భద్రతను మెరుగుపరచాలని, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసినట్లు డాక్టర్ శిల్పారెడ్డి వెల్లడించారు.