దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొల్లారం రెజిమెంట్ చోరీతో భద్రతా సంస్థలు ఉలిక్కి పడుతున్నాయి. ఎన్ఐఏ మొదలు అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తులో పాల్గొంటున్న్పపటీకీ నాలుగు రోజులైనా కేసులో పురోగతి లేకపోవడం, ఆయుధాల ఆచూకీ కనిపించక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సందర్భంగా ఉగ్రకోణంపై దృష్టి సారిస్తున్నారు.
మరోవైపు ఆయుధాలు భద్రపరిచే గదిలోని సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం, అదే సమయంలో రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడటం అనుమానాలకు తావిస్తోంది. సుమారు 10 రోజులుగా కెమెరాలు ఆఫ్ అయినట్లు గుర్తించడంతో ఈ రెండు పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమెరాల వ్యవహారం, రికార్డుల నిర్వహణలో లోపాలు, లోపలి వ్యక్తుల ప్రమేయం, ఆయుధాల తరలింపు మార్గం, ఉగ్రకోణం ఇలా ప్రతి అంశాన్ని విడివిడిగా పరిశీలిస్తున్నాయి.
చోరీ జరిగిన సుమారు 10 రోజుల ముందు వరకూ ఆయుధాలు, మందుగుండుకు సంబంధించిన రికార్డులు సక్రమంగానే ఉన్నాయి. తర్వాత నుంచి వివరాలను నమోదు చేయడంలో నిర్లక్ష్యం జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. దీంతో ఆయుధాలు, తూటాలు ఒకేసారి కాకుండా కొన్ని రోజులుగా కొన్ని కొన్ని బయటకు తరలించి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అత్యాధునికమైన ఈ ఆయుధాలు బయటకు వెళ్లడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఆయుధాలు చోరీ చేసింది ఎవరన్న దానికంటే అవి ఎక్కడున్నాయనేది అధికారులను మరింత కలవరపెడుతోంది. బొల్లారం పోలీసులు, మిలిటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా ఆధారాలు సేకరిస్తున్నారు. కోట్ వద్ద ఎన్ఐఏ అధికారులు కొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
మద్రాస్ రెజిమెంట్‌లోని కోటె ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రతిరోజూ రాత్రి పదిన్నర గంటల తర్వాత ఆపేసి, తిరిగి ఉదయం 7 గంటల తర్వాత ఆన్ చేస్తున్నట్లు తేలింది. ఇలా చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవని తెలుస్తోంది. మరి సీసీ కెమెరాలను ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? చోరీ జరిగిన సమయంలోనే కెమెరాలు పని చేయకపోవడానికి కారణమేంటి? అన్నదానిపై దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మద్రాస్ రెజిమెంట్‌లో దాదాపు 800 మంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు రాత్రి కోట్‌తో పాటు రెజిమెంట్‌లో విధుల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ అయిన వారిని కూడా పిలిపించి విచారణ జరుపుతున్నారు. వారి ఫోన్లను సైతం విశ్లేషిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లభించలేదని తెలుస్తోంది.

More Stories
శ్రీశైలంలో తక్షణమే జలవిద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలి
మంత్రి పదవి తొలగింపులో కుట్ర.. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్!
సెక్రటేరియట్ వద్ద ఆందోళన.. బీజేపీ నేతల అరెస్ట్