పాకిస్థాన్‌లోని నరోవాల్ ప్రాంతంలో శతాబ్దపు నాటి హిందూ ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన వార్తలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిని ‘అత్యంత అభ్యంతరకరమైన విధ్వంసక చర్య’గా అభివర్ణించింది. ఈ ఘటనపై తక్షణమే పారదర్శకంగా విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది.
లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో, పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన 100 ఏళ్ల నాటి హిందూ ఆలయాన్ని ఆగస్టు 21న కూల్చివేసినట్లు సమాచారం. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ వార్తలను భారత్ ‘తీవ్ర ఆందోళన’తో గమనించిందని. ఈ విధ్వంసాన్ని ఖండించిందని తెలిపారు.
ఈ ఘటనను మైనారిటీ ప్రార్థనా స్థలంపై జరిగిన ఆందోళనకరమైన దాడిగా, మతపరమైన వారసత్వాన్ని రక్షించడంలో అక్కడి అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొన్న విదేశీ వ్యవహారాల శాఖ, పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలు నిరంతరం ఎదుర్కొంటున్న దుస్థితిని ఇటువంటి ఘటనలు ఎత్తిచూపుతున్నాయని తెలిపింది. “అధికారుల నిర్లక్ష్యం, శతాబ్దపు నాటి ఈ ఆలయాన్ని రక్షించడంలో వారి వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న దుస్థితిని, అలాగే వారి మత స్వేచ్ఛ, ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న తీవ్రమైన ఉల్లంఘనలను ఇటువంటి ఘటనలు గుర్తుచేస్తున్నాయి” అని జైస్వాల్ పేర్కొన్నారు.
“అపవిత్రం చేసిన ఆలయాన్ని పునరుద్ధరించడానికి పాకిస్థాన్ తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే, తమ మైనారిటీ పౌరులందరి భద్రత, రక్షణ, శ్రేయస్సు, వారి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలనే ప్రాథమిక బాధ్యతను నెరవేర్చాలి” అని భారత్ స్పష్టం చేసింది. స్థానికుల సమాచారం ప్రకారం, నిషేధిత మితవాద ఇస్లామిక్ పార్టీ అయిన ‘తహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్’ (టి ఎల్ పి)కు చెందిన మతపరమైన దురహంకారుల బృందం, ఆ ఆలయ స్థలాన్ని పక్కనే ఉన్న మదర్సాలో విలీనం చేసేందుకు ఆ ఆలయాన్ని కూల్చివేసింది.
ఆలయ కూల్చివేతలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని, దాని పునర్నిర్మాణాన్ని నిర్ధారించాలని పాకిస్తాన్ మసీహా మిల్లత్ పార్టీ (పీఎంఎంపీ) పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. తాను ఆగస్టు 28న పంజాబ్ అదనపు హోం సెక్రటరీని కలిసి, ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై, ఆలయాన్ని రక్షించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించినట్లు దాని ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా తెలిపారు.
కూల్చివేసిన ఆలయ శిఖరంలోని లోహపు అమరికలు, ఇతర సామాగ్రి, ఇటుకలను ఆ తర్వాత అక్కడి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ స్థాపన తర్వాత నరోవల్ జిల్లాలో 45 హిందూ దేవాలయాలు ఉండేవని, అయితే కాలక్రమేణా అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయని చెబుతున్నారు.

More Stories
బంగ్లాదేశ్‌లో ‘జాతీయ సంక్షోభం’.. తాజా ఎన్నికలకై హసీనా పిలుపు
ఇరాన్‌కు రష్యా సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెక్నాలజీ
నేపాల్ జల విద్యుత్ సొరంగాల్లో భారత్, చైనా సైనిక నిపుణుల అన్వేషణ