రామ మందిరం సీఈఓ కావడం శ్రీ రాముడి ఆశీర్వాదం

రామ మందిరం సీఈఓ కావడం శ్రీ రాముడి ఆశీర్వాదం
* ట్రస్ట్ నూతన ప్రధాన కార్యదర్శిగా  స్వామి గోవింద్ దేవ్ గిరి, కోశాధికారిగా  మహేష్ భగ్‌చంద్‌కా, మొదటిసారి ట్రస్ట్ లో ఓ మహిళ
 
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యొక్క మొదటి సీఈఓగా నియమితులైన తర్వాత, ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) జితేంద్ర మిశ్రా స్పందిస్తూ, ఇంతమంది అభ్యర్థుల నుండి తనను ఎంపిక చేయడం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. “అనేకమంది అభ్యర్థుల నుండి నన్ను ఎంపిక చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. వాయుసేనలో దేశానికి 43 ఏళ్లపాటు సేవలు అందించిన తర్వాత, శ్రీరామ మందిరానికి, శ్రీరామ భక్తులకు సేవ చేసే అవకాశాన్ని ఆ శ్రీరాముడు నాకు ప్రసాదించడం ఆయన ఆశీర్వాదంగా భావిస్తున్నాను,” అని ఆయన తెలిపారు.
 
ఈ బాధ్యత కోసం తనను ఎంపిక చేసినందుకు ఎంపిక కమిటీకి, శ్రీరామ మందిర ట్రస్ట్‌కు, శ్రీరాముడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. “ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను,” అని ఆయన తెలిపారు.  మరోవంక, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఆలయ ట్రస్ట్‌లోని కీలక బాధ్యతలను ఇద్దరు ప్రముఖ సభ్యులకు అప్పగించినట్లు ప్రకటించింది.
మహేష్ భగ్‌చంద్‌కాకు కోశాధికారి బాధ్యతలు అప్పగించగా, స్వామి గోవింద్ దేవ్ గిరి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా తన సేవలను కొనసాగిస్తారు. స్వామి గోవింద్ దేవ్ గిరి రామ మందిర ప్రాజెక్ట్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రముఖులలో ఒకరు.  గతంలో కోశాధికారిగా  ఆయన ట్రస్ట్ సంస్థాగత నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. కొత్త ట్రస్టీల నియామకం తర్వాత కూడా ఆయన ఆ కీలక పదవిలో కొనసాగడం వల్ల ట్రస్ట్ నాయకత్వంలో కొనసాగింపు లభిస్తుంది.
 
ముగ్గురు కొత్త తృస్టీలలో తొలి మహిళ డా. నిర్మలా యాదవ్ 
 
ఈ ట్రస్ట్ బుధవారం ముగ్గురు కొత్త ట్రస్టీలను నియమించింది. వీరిలో ఒక మహిళా సభ్యురాలు కూడా ఉన్నారు. విరాళాల చోరీ వివాదం తర్వాత ట్రస్ట్ విశ్వసనీయతను, ప్రజల్లో దానిపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, వివిధ వృత్తులు, అనుభవ రంగాలకు చెందిన వ్యక్తులను ఇందులో చేర్చుకోవడం గమనార్హం. అలాగే, ఒక మహిళా ఓబిసి సభ్యురాలిని నియమించడం ద్వారా సామాజిక ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేయడం కూడా ఈ నియామకాలలో ముఖ్యమైన అంశం. 
 
గత ఏడాది బిమలేంద్ర మోహన్ మిశ్రా మరణం, విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలను ఈ ముగ్గురు భర్తీ చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్‌కు చెందిన రిటైర్డ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మలా యాదవ్, ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’లో మొదటి మహిళా సభ్యురాలిగా చేరారు. 
 
హిందీ, సంస్కృతంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన 66 ఏళ్ల ఈమె, 19 ఏళ్లపాటు కళాశాల ప్రిన్సిపాల్‌గా మరియు 15 ఏళ్లపాటు విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా పనిచేశారు. తద్వారా విద్యా మరియు సంస్థాగత నిర్వహణలో ఆమెకు గణనీయమైన అనుభవం ఉంది.  74 ఏళ్ల మదన్ మోహన్ పాండేను ట్రస్ట్ సభ్యుడిగా చేర్చుకోవడం ద్వారా మరో రకమైన సంస్థాగత అనుభవం లభిస్తుంది. అయోధ్య కంటోన్మెంట్‌కు చెందిన న్యాయవాది అయిన పాండే, దాదాపు మూడు దశాబ్దాల పాటు రామ జన్మభూమి న్యాయ పోరాటంతో సంబంధం కలిగి ఉన్నారు. 
 
ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అయిన భగ్‌చంద్‌కా ట్రస్ట్ కొత్త కోశాధికారిగా నియమితులయ్యారు. చంపత్ రాయ్ స్థానంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గోవింద్ గిరి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అశోక్ సింఘాల్ ఫౌండేషన్‌తో అనుబంధం ఉన్న భగ్‌చంద్‌కా, ‘వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్’ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కూడా.
 
‘శ్రీరామ వన గమన యాత్ర’తో ముడిపడి ఉన్న 222 ప్రదేశాలలో ‘రామ స్తంభాల’ ఏర్పాటులో ఆయన పాలుపంచుకున్నారు, అలాగే రామమందిర భూమి పూజ, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలలో ‘యజమాని’గా పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ అయిన భగ్‌చంద్‌కా “హిందుత్వ కే ప్రయోగ” అనే పుస్తకాన్ని రచించారు.