ఐఐటీ బొంబాయి విద్యార్థి ఆత్మహత్య కేసులో సెలవుపై ప్రొఫెసర్ దూల్లా

బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య నేపథ్యంలో, ఐఐటి బొంబాయి బుధవారం ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను సెలవుపై పంపి, అతని మరణానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించడానికి 10 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఐఐటి పాలక్కాడ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ ప్రొఫెసర్ రమేష్ వెంకటేశ్వరన్ నేతృత్వం వహిస్తారు. వారం రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఈ బృందాన్ని కోరారు. 
 
ఈ కమిటీలో హాస్టల్ వ్యవహారాల జనరల్ సెక్రటరీ ఆదిత్య జోషి, స్టూడెంట్ మెంటర్ ప్రోగ్రామ్ ఓవరాల్ కోఆర్డినేటర్ దేవ్ అరోరా, రీసెర్చ్ స్కాలర్ దేవి లాల్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు కూడా ఉన్నారు. వీరే కాకుండా, పదవీ విరమణ చేసిన ఒక ఐఏఎస్ అధికారితో సహా ఇతర సభ్యులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. విద్యార్థులు ముందుకు తెచ్చిన డిమాండ్లను కూడా బోర్డు పరిగణనలోకి తీసుకుంది. రాజీనామా డిమాండ్ మినహా మిగతా డిమాండ్లలో చాలావాటికి అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
ఈలోగా, నిందితుడు ప్రొఫెసర్ సూర్యనారాయణ్ దూల్లాను బుధవారం విచారణ నిమిత్తం ముంబై క్రైమ్ బ్రాంచ్ పిలిపించింది. నిన్న, క్రైమ్ బ్రాంచ్ బాధితుడైన సాహిల్ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ రోజు ఉదయం, ఐఐటి బొంబాయి పూర్వ విద్యార్థుల సంఘం (ఐఐటిబిఎఎ), విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్యగా ఆరోపించబడిన ఘటనపై నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరపాలని డిమాండ్ చేసింది. అలాగే, ఏ ఒక్క వ్యక్తిపైనా ‘మీడియా విచారణ’, ఊహాగానాలు లేదా ‘దురుద్దేశపూరిత నిర్ధారణలు’ ఉండకూడదని పేర్కొంది.
కాగా, పరీక్ష సమయంలో విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన అనంతరం అతడిని పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లాలని ప్రొఫెసర్, పరీక్ష పర్యవేక్షకుడు సూర్యనారాయణ సూచించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.  ఈ ఫుటేజీని పోలీసులు విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు. భవనంలోని ఇతర సీసీటీవీ కెమెరాల్లోనూ సాహిల్ పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చి క్యాంపస్ హాస్టల్‌లోని తన గదికి వెళ్లిన దృశ్యాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 
 
బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి అయిన సాహిల్‌ వాకోడే గత శుక్రవారం సాయంత్రం హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకోవడం తెలిసిందే. ప్రొఫెసర్‌ సూర్యనారాయణ కుల వివక్ష చూపడం, మానసికంగా వేధించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని సాధారణ పోలీసు విభాగం నుంచి క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
 
మరోవంక, తమ కుమారుడి మరణానికి ప్రొఫెసర్‌ సూర్యనారాయణ, డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే వేధింపులే కారణమని, వారిని అరెస్ట్‌ చేయాలని సాహిల్‌ తల్లిదండ్రులు మరోసారి డిమాండ్‌ చేశారు. అయితే.. సాహిల్‌ విద్యా సంస్థలోని ఎస్సీ/ఎస్టీ సెల్‌కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌ పంత్‌ తెలిపారు. మరోవైపు, ఐఐటీ బాంబే యాజమాన్యం హాస్టళ్ల గదుల్లో సీలింగ్‌ ఫ్యాన్లు తొలగించి, వాటి స్థానంలో వాల్‌ మౌంటెడ్‌ ఫ్యాన్లు (గోడకు అమర్చే) ఏర్పాటు చేయిస్తోంది.
 
తన ఆత్మహత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో పేరు నమోదైన ప్రొఫెసర్ వల్ల ఎదురైన కుల వివక్ష గురించి సాహిల్ గతంలోనే తమకు చెప్పాడని తల్లితండ్రులు తెలిపారు. “ఐఐటీలో సీటు సంపాదించడం ఎంత కష్టమో చెప్పి, ఆ పరిస్థితులను భరించమని నేను వాడికి చెప్పాను,” అని అతని తండ్రి రవీంద్ర వకోడే  పేర్కొన్నారు.  “తల్లిదండ్రులుగా మేము మా బిడ్డకు మానసిక మద్దతునిచ్చాం. అది తప్పా?” అని తల్లి సోనాలి వకోడే ప్రశ్నించారు.
అలాగే ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాహిల్‌ను “వేధించిన” వారిలో ఐఐటీ బాంబే డైరెక్టర్ షిరీష్ కేదారే కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.  సాహిల్ మరణం గురించి తమకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని, అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని కూడా తండ్రి ఆరోపించారు. “కీలకమైన ఆధారాలను ధ్వంసం చేయడంలో ఐఐటీ యాజమాన్యం ప్రమేయం ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.

 

About The Author