హైదరాబాద్‌ను లూటీ చేసేందుకే కాంగ్రెస్ ‘క్యూర్’ కుట్ర

హైదరాబాద్‌ను లూటీ చేసేందుకే కాంగ్రెస్ ‘క్యూర్’ కుట్ర
హైదరాబాద్ మహానగరాన్ని అడ్డగోలుగా లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చి కొత్తగా ‘కోర్ అర్బన్ రీజియన్’ పేరుతో తీసుకొస్తున్న విధానం ప్రజలకు ఒక శాపంలా మారబోతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు హెచ్చరించారు. 
 
ఈ విధానం ద్వారా కార్పొరేటర్లకు విలువ లేకుండా పోతుందని, మేయర్‌కు ఎలాంటి అధికారాలు ఉండవని, మొత్తం పెత్తనాన్ని ముఖ్యమంత్రి తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.  మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం, నూతన జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ఆదివారం పాల్గొంటూ  దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారీగా పన్నుల భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదని, ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలని, కానీ నేడు రేవంత్ రెడ్డి సర్కార్ నిరంకుశ చర్యలను చూసి ప్రజలు భయపడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారం రాగానే హైడ్రా పేరుతో చేతికి గడ్డపార పట్టి పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేశారని ధ్వజమెత్తారు. 
 
అలాగే పరిశ్రమల భూములను, ఇతర భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి, ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పాలన నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి సొంతంగా నిధులు సమకూర్చుకునే సామర్థ్యం లేక కేవలం బిల్డర్లు, రియల్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేయడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. 
 
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 15 శాతం కమీషన్లు ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అది ఏకంగా 30 శాతం కమీషన్ సర్కార్‌గా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారని స్పష్టం చేశారు.  ఇటీవలి ఇండియా టుడే – సి ఓటర్ సర్వేలో తెలంగాణలో బీజేపీ 8 నుండి 10 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతోందని స్పష్టమైందని తెలిపారు. 
ఈరోజు ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు విద్యార్థులే మన దేశ భవిష్యత్తు అని చెబుతూ, ‘నశా ముక్త్ భారత్’ (మత్తు రహిత భారతం) దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇచ్చిన సందేశాన్ని రాoచందర్ రావు  గుర్తుచేశారు. తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్, మత్తు పదార్థాల విక్రయాలు సాగుతున్నాయని, రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు ఏకంగా 43 శాతం పెరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.   పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.