రాజీనామాకు ససేమీరా.. పరారీలో మజ్లీస్ ఎమ్యెల్సీ బేగ్

రాజీనామాకు ససేమీరా.. పరారీలో మజ్లీస్ ఎమ్యెల్సీ బేగ్

బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మజ్లిస్‌ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ పార్టీ ఆదేశానుసారం పదవికి రాజీనామాకు నిరాకరిస్తూ, అదృశ్యమయ్యారు. ఆయనతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించగా ఇప్పుడే వస్తానంటూ తప్పించుకున్నారు. దీంతో రహ్మత్‌ బేగ్‌ కోసం మజ్లిస్‌ శ్రేణులు గాలిస్తున్నాయి.

98 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ హైదరాబాద్‌ కేంద్రంగా దేశం మొత్తం విస్తరిస్తుండగా, పార్టీ నాయకత్వం ఆదేశాలు ధిక్కరించిన మొదటి ప్రజా ప్రతినిధిగా భావిస్తున్నారు. ఓ బాలికతో రహ్మత్‌ బేగ్‌ సన్నిహితంగా ఉండగా స్థానికులు గమనించి దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై విచారణ జరిపించిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో శనివారం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.

దీంతోపాటు ఎమ్మెల్సీ పదవిని వెంటనే వీడాలని, రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు అందజేయాలని పార్టీ ఆదేశించింది.  గత కొద్దిరోజులుగా ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాలో ఉన్న రహ్మత్‌ బేగ్‌ పార్టీ ఆదేశాలతో శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. అంతకుముందు సౌదీ అరేబియా నుంచే పంపిన వీడియో సందేశంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఏఐ టెక్నాలజీతో డీప్‌ ఫేక్‌ వీడియోలు సృష్టించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 

దీనిపై ఇప్పటికే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానన్నారు. అయితే శనివారం ఆయన నగరానికి వచ్చిన వెంటనే రాజీనామా చేయాలన్న ఆదేశాలు అందాయి. దీనిపై రహ్మత్‌ బేగ్‌ స్పందిస్తూ  తాను తప్పు చేయలేదని, రాజీనామా చేయబోనని మొండికేశారు.  దీంతో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన రహ్మత్‌ బేగ్‌ను ఆదివారం ఎంఐఎంకు చెందిన కొందరు సీనియర్‌ నేతలు నగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్టు తెలిసింది. 

అక్కడ రాజీనామా చేయాల్సిందేనంటూ బలవంతం చేశారు. అప్పటికే సిద్ధం చేసిన ఎమ్మెల్సీ రాజీనామా పత్రంపై సంతకం చేయాలని కోరారు. అయితే పది నిమిషాల సమయం ఇవ్వండి.. ప్రార్థన చేసి వస్తానంటూ వారిని కోరిన రహ్మత్‌ బేగ్‌ అక్కడి నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. ఒవైసీ బ్రదర్స్‌ మాటను పార్టీలో ఎక్కడా జవదాటరు. కానీ, రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి తోలగించి రాజీనామా చేయాలని ఆదేశించినా చేయనని చెప్పడం, తప్పించుకోవడం విస్మయం కలిగిస్తోంది. 

మిర్జా రహమత్‌ బేగ్‌ డ్రైవర్‌ స్థాయి నుంచి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తొలుత చార్మినార్‌ మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌గా పనిచేసిన మీర్జా రహ్మత్‌ బేగ్‌ అనతికాలంలోనే ఎంఐఎంలో కీలక నేతగా ఎదిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌లో పోటీచేసి ఓడిపోయినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఎంఐఎంకు చెందిన అనేక వ్యవహారాలను ఈయనే చక్కదిద్దేవారు. 

నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు ఎదురైనా పార్టీ ప్రతినిధిగా ఈయనే ముందుండి పరిస్థితిని చక్కదిద్దేవారు.  రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నిక కానంతవరకు రహ్మత్‌ బేగ్‌ గురించి పార్టీ కీలక నేతలకు తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. పార్టీలో చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను ఎమ్మెల్సీని చేశారు. కాగా, తాజా సంఘటన జరగనంత వరకు పార్టీలో అక్బరుద్దీన్‌ మినహా మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల కంటే రహ్మత్‌ బేగేపవర్‌ఫుల్‌ నేతగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.