రూ. 27 కోట్లతో వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

రూ. 27 కోట్లతో వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

రూ. 27 కోట్ల వ్యయంతో వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని  వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన అనంతరం  కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ ద్వారా రోజుకు సుమారు 15,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం 60 రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు.
 ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారని చెబుతూ ఈ ఏడాది చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఈ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఉమ్మడి పాలనలో తెలంగాణ రైల్వే రంగం తీవ్ర అన్యాయానికి గురైంది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారి, రాష్ట్రంలో రూ. 80 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులతో పాటు రైల్వే లైన్లలో వంద శాతం విద్యుద్దీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. 

తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్, తాండూరు, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి వంటి స్టేషన్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. అదనంగా, చర్లపల్లి టెర్మినల్ ను అత్యద్భుతంగా సిద్ధం చేశారని వివరించారు. 
హైదరాబాద్ – సిద్దిపేట – జగిత్యాల మార్గంలో నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే సిద్దిపేట వరకు సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
రైల్వే ప్రమాదాలను నివారించేందుకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన స్వదేశీ సాంకేతికత ‘కవచ్’, ‘కవచ్ 2.0’ తొలిసారిగా తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు. అలాగే, స్వదేశీ సాంకేతికతతో తయారైన వందే భారత్ రైళ్లలో భాగంగా హైదరాబాద్ నుంచి 5 రైళ్లు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.

​కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని పేర్కొంటూ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణే నగరాలకు బుల్లెట్ రైళ్లు రానున్నాయని తెలిపారు. 

కాజీపేట, ఖమ్మం తర్వాత వికారాబాద్ ప్రజలే ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారని చెబుతూ ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రైల్వేతో పాటు వికారాబాద్ జిల్లాలో జాతీయ రహదారి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.