వాల్మీకి కుంభకోణం ఆరోపణలతో రెండేళ్ల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసి, ఇటీవలే తిరిగి డీకే శివకుమార్ మంత్రివర్గంలో చేరిన 25 రోజులకే ఇప్పుడు అదే వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో మంత్రివర్గం నుంచి కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే బీ నాగేంద్ర తప్పుకున్నారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సుమారు రూ.89 కోట్ల నిధుల ఆక్రమ బదిలీ జరిగిందన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపాయి.
2024 మేలో కార్పొరేషన్ అకౌంట్స్ అధికారి పీ చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకోవడం ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన రాసినట్లు పేర్కొన్న లేఖలో అనుమతి లేకుండా నిధులను ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం జరిగిన దర్యాప్తులో కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాల నుంచి భారీ మొత్తాలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్రపై కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర ఈ వివాదం నేపథ్యంలో 2024 జూన్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్లోకి నాగేంద్రను ఆగస్టు 3న తిరిగి తీసుకున్నారు. ఈసారి ఆయనకు ప్రణాళిక, గణాంకాల శాఖను కేటాయించారు.
అయితే తిరిగి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పాత వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్రంగా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. వర్షాకాల సమావేశాల సమయంలోనూ శాసనసభ లోపల, బయటా ఇదే అంశంపై బీజేపీ, జేడీఎస్ నిరసనలు తెలిపాయి. వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో జరిగిన స్కామ్ గురించి బీజేపీ మళ్లీ పోరుబాట పట్టింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను బయటపెట్టేందుకు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూర్ నుంచి బళ్లారి వరకు 10 రోజుల పాదయాత్రను ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి బీ నాగేంద్ర అనూహ్యంగా శుక్రవారం రెండోసారి మంత్రివర్గం నుంచి తన రాజీనామాను ఆయన ప్రకటించారు. శుక్రవారం తన రాజీనామాను ప్రకటించేటప్పుడు భావోద్వేగానికి లోనైన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
బీజేపీ తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నదని బీ నాగేంద్ర ఆరోపించారు. “నాకు రాజ్యాంగంపై నమ్మకం ఉంది. నాపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీని అనేకసార్లు మేం కోరాము. కానీ వారు అందుకు ముందుకు రాలేదు. ‘మనుస్మృతిని రుద్దాలని’ బీజేపీ కోరుకుంటోంది. ఆ పార్టీకి ‘గిరిజన వ్యతిరేక వైఖరి’ ఉన్నది” అంటూ మీడియా ముందు ఆరోపణలు గుప్పించారు.
నాగేంద్ర 2008లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. 2013లో స్వతంత్ర అభ్యర్థిగా కుడ్లిగి నుంచి గెలిచారు. అనంతరం 2018లో కాంగ్రెస్‌లో చేరి బళ్లారి ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

More Stories
‘దిమాగీ నక్సల్స్’తో సోనియా నేతృత్వంలోని సలహా మండలి!
నేషనల్ కాన్ఫెరెన్స్ కు, పదవికి శ్రీనగర్ ఎంపీ రాజీనామా!
టిబెట్ వైపు నుండి వరదల సమాచారాన్ని కప్పిపుచ్చుతున్న చైనా?