అంతర్గత కలహాలతో కూలిపోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

అంతర్గత కలహాలతో కూలిపోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
* బిజెపి కార్యాలయంలో రామచందర్ రావు రెండు రోజులపాటు ‘ఫీజుల బకాయిలు.. బిజెపి లడాయి’ దీక్ష 
 
కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత కలహాలు, మంత్రివర్గంలో లుకలుకలతో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే స్థితిలో ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్‌లో అవినీతి కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం వల్లే ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు, రహస్య సమావేశాలు జరుగుతున్నాయని ఆయన ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఆరోపించారు. 
 
ప్రజలు ఐదేళ్ల పాలన కోసం అధికారం ఇస్తే, ఈ ప్రభుత్వ పని తీరు చూస్తుంటే ఐదేళ్లు కూడా నడిచేలా కనిపించడం లేదని చెప్పారు. గతంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన బిఆర్‌ఎస్‌ను, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలను తిరస్కరించి, ప్రజలు తమ పార్టీ వైపే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ఆయన తెలిపారు. 
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన, దోపిడీకి పాల్పడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ’బ్రదర్స్ సర్కార్’గా మారి దోపిడీ చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం 10-15 శాతం కమీషన్లు తీసుకుంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా 30 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. 
రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లను 22ఏ పేరుతో తీవ్రంగా వేధిస్తూ దోచుకుంటున్నారని పేర్కొంటూ ఈ 22ఏ భూముల సమస్యపై తమ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 
 
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. బకాయిలు చెల్లించేవరకు తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తాము రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. 
 
కాగా ప్రభుత్వం పోలీసుల ద్వారా అనుమతి నిరాకరించారని చెబుతూ  పోలీసుల ఆంక్షలకు భయపడేది లేదని, రోడ్డుపై కాకపోతే పార్టీ కార్యాలయ ప్రాంగణంలోనే ఈ రెండు రోజుల నిరాహార దీక్షను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.  ఎన్నికల ముందు రాష్ట్రంలోని విద్యార్థులకు ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించారని విమర్శించారు.   
పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా విదేశాలకు పారిపోతూ రోడ్లపై డ్రామాలు చేసే రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్‌కు వచ్చి విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో విద్యార్థులు రాహుల్ గాంధీని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.