గత బీఆర్ఎస్ పాలనలో ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలను సముద్రంలో పడేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ‘భూభారతి’ పేరుతో అంతకంటే తీవ్రమైన దోపిడీకి పాల్పడుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ (నిషేధిత జాబితా) లోకి చేర్చారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత 2-3 ఏళ్లలో 2ఏ లో చేర్చిన, తొలగించిన భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులకు మండల స్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా సంపూర్ణ ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా పేదలకు కేంద్ర ప్రభుత్వమే 70 శాతానికి పైగా సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, రవాణా, డీలర్ల కమిషన్ భరిస్తూ 5 కేజీల ఉచిత బియ్యం అందిస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర లోగోను ముద్రిస్తుంటే, తెలంగాణలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు, భారత ప్రభుత్వ లోగో లేకుండా కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటోలు మాత్రమే వేసుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలకు చెల్లించాల్సిన సుమారు రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిధులు రాక ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయని, ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలు కోల్పోయి నిత్యం వందలాది మంది విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రులు లేదా మంత్రుల అధికారిక విదేశీ పర్యటనలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ దౌత్య నిబంధనలు, అంతర్జాతీయ భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో రాజకీయ కక్షసాధింపులు ఉండవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాం నుంచే ఉన్న ఈ నిబంధనల ప్రకారం బీజేపీ మంత్రుల పర్యటనలకు కూడా పలుమార్లు అనుమతులు రాలేదని, దీన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అని, “ఒక వ్యక్తి – ఒకే ఓటు” నిబంధన ప్రకారం దేశవ్యాప్తంగా డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించి ఓటర్ల జాబితాను శుద్ధి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో గ్రామీణ ఓట్లను తగ్గించి మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజలను బెదిరించారని ఆరోపించారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు దశాబ్దాలుగా ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుతుంటే, తెలంగాణలో మాత్రం గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ పార్టీ భయంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అధికారికంగా నిర్వహించకుండా చరిత్రను తొక్కిపెట్టాయని విమర్శించారు.

More Stories
పార్టీ బలోపేతంకై కొత్త ఆలోచనలు, దృక్పధాలు.. మోదీ
పునరుత్పాదక ఇంధనంతో బొగ్గు అనుసంధానం ముఖ్యం
డార్జిలింగ్ సమస్యకు “శాశ్వత రాజకీయ పరిష్కారం”కై కమిటీ