ప్రజారోగ్య పరిరక్షణలో అల్లోపతి వైద్యులతో సమానంగా అహర్నిశలు సేవలందిస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ విషయంలో తీవ్ర వివక్ష చూపడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంరద్ రావు విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానే ఆయుష్ పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లకు అల్లోపతితో సమానంగా స్టైఫండ్‌ను పెంచి, పెండింగ్ ఎరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయుర్వేద, యునాని, హోమియోపతి వంటి భారతీయ వైద్య విధానాల్లో సేవలందిస్తున్న పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు స్టైఫండ్ పెంచకుండా అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారతీయ వైద్య రంగం (ఆయుష్), అల్లోపతి వైద్య విద్యార్థులను సమానంగా చూడాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2016 నుంచి ఈ స్టైఫండ్లను నిలిపివేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
అల్లోపతి వైద్య విద్యార్థుల మాదిరిగానే ఆయుష్ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారికి సమానంగా స్టైఫండ్లు చెల్లించాలని న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ పీజీ విద్యార్థులకు నెలకు రూ. 60 వేలు, హౌస్ సర్జన్లకు రూ. 25 వేలు చొప్పున స్టైఫండ్ చెల్లిస్తుంటే, తెలంగాణలో మాత్రం పీజీ విద్యార్థులకు కేవలం రూ. 30 వేలు, హౌస్ సర్జన్లకు రూ. 13 వేలు మాత్రమే ఇవ్వడం తీవ్ర వివక్షాపూరితమని మండిపడ్డారు.
పొరుగు రాష్ట్రం అమలు చేస్తున్న నిబంధనలను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయుష్ వైద్యులకు సమాన స్టైఫండ్ అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసిన నేటి ఉపముఖ్యమంత్రి, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్‌తో సహా ఏపీ తరహాలో పూర్తి స్థాయి స్టైఫండ్‌ను తక్షణమే చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన ఇడి
కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘జేవీ లూట్’పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి
తెలంగాణాలో సినిమా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు