ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్‌ను తగలబెడతాం

* దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు

 
ఓట్ల తొలగింపు విషయంలో ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే హైదరాబాద్‌లో పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరిస్తూ  మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మరోసారి  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని, ఈసీ కార్యాలయాన్ని తగలబెడతామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.  ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని,  చాలాకాలంగా అదే ప్రాంతాల్లో ఉంటున్నవారివి.. గత ఎన్నికల్లో కూడా ఓటు వేసిన వారి పేర్లను కూడా ఇప్పుడు జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. 
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ తొలగించిన పేర్లను పరిశీలించి అర్హులైన వారి ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ఖైరతాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఎస్ఐఆర్ నోటీసులు జారీ అయ్యాయని ఆయన గతంలోనూ పేర్కొన్నారు. ఓట్లు తొలగింపు విషయంలో ఈసీ స్పందించకపోతే హైదరాబాద్ లో పరిస్థితులు సాధారణంగా ఉండవంటూ నాగేందర్ తీవ్ర వాఖ్యలు చేశారు. ఓట్లను పునరుద్ధరించకపోతే నిరసనలు, పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
 
ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.  ఇందులో చాలా మంది బీజేపీతో అనుబంధంగా ఎవరైతే ఏఎంసీలున్నరో, ఏఆర్‌వోలున్నరో బీజేపీతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు.  కాబట్టి కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న. ఎవరైతే మా ఓట్లు తీయించే ప్రయత్నం జరుగుతున్నదో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
2000, 2002 నుంచి అదే ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తులు, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్లుగా ఉన్నవారి పేర్లు ఇప్పుడు తొలగించారని నాగేందర్ పేర్కొన్నారు. నిజమైన ఓటర్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంటూ తొలగించిన ఓట్లను మరోసారి పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 

About The Author