జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగి 219/5 భారీ స్కోరు నమోదు చేసిన టీమిండియా, అనంతరం బౌలింగ్ లోనూ బెంబేలెత్తించింది. భార‌త బౌల‌ర్ల‌ ధాటికి జింబాబ్వే 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

జింబాబ్వేను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఇషాన్ కిషన్‌(81), తిలక్ వర్మ(60 నాటౌట్) మెరుపులతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన అయ్యర్ సేన 90 పరుగుల తేడాతో గెలిచింది. 220 పరుగుల ఛేదనలో జింబాబ్వే బ్యాటర్లను ప్రిన్స్ యాదవ్‌(2-10), అభిషేక్ శర్మ(3-17)లు బెంబేలెత్తించారు. సమిష్టి వైఫల్యంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఆఫ్రికా జట్టు మరో ఓటమి చవిచూసింది.

భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు వైభవ్ సూర్యవంశీ (20) వేగవంతమైన ఆరంభం అందించాడు. అనంతరం ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి 44 బంతుల్లో 81 పరుగులతో భార‌త్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు.  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేయగా, తిలక్ వర్మ అజేయంగా 29 బంతుల్లో 60 పరుగుల హాఫ్ సెంచ‌రీ చేసి జట్టును 219/5 భారీ స్కోరుకు చేర్చాడు.

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు బ్రియాన్ బెన్నెట్ (32), తాడివానాషే మరుమాని (24) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో 7 వికెట్లతో గెలిచిన టీమిండియా రెండో టీ20లోనూ జింబాబ్వేను వణికించింది. రికార్డు స్థాయిలో 52వ సారి రెండొందలకు పైగా కొట్టిన భారత్ ప్రత్యర్థిని పరిమితం చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది.

భారత్ తరఫున అరంగేట్రం మ్యాచ్ ఆడిన యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టగా, ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు, అభిషేక్ శర్మ మూడు వికెట్లు, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ తీశారు. ర్యాన్‌ బర్న్‌ (20), మరుమణి (24), బ్రాడ్‌ ఎవాన్స్‌ (19) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ (3/17) మూడు వికెట్లతో ఆకట్టుకోగా, ఇషాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.  

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-0తో అజేయ ఆధిక్యం సాధించగా, మూడో, చివరి టీ20 కూడా హరారే వేదికగా 24 గంటల వ్యవధిలోనే జరగనుంది.