సృష్టి ఆరంభం నుంచి మాతృత్వం అనే పునాదిపైనే ప్రపంచం

సృష్టి ఆరంభం నుంచి మాతృత్వం అనే పునాదిపైనే ప్రపంచం
సృష్టి ఆరంభం నుంచి, ప్రపంచం మాతృత్వం అనే పునాదిపైనే నడుస్తోందని, ఏ జీవి ఉనికిలోకి వచ్చినా అక్కడ మాతృత్వం అంతర్లీనంగా ఉంటుందని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. ఢిల్లీలో  “యుగానుకూల మాతృత్వం” (కాలానికి అనుగుణమైన మాతృత్వం) అనే అంశంపై ‘విశ్వమాంగళ్య సభ’ నిర్వహించిన అవగాహన సదస్సు ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ  ఎప్పుడూ ఒక తల్లి ఉంటుందని, మాతృత్వం లేకుండా ప్రపంచ సృష్టి, స్థితి (నిర్వహణ),  పోషణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. 
 
స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు ఈ ప్రశ్నలపై సమగ్రంగా ఆలోచించి, తమ అభిప్రాయాలను మన ముందు ఉంచారని తెలిపారు. “ఈ కార్యక్రమానికి “యుగానుకూల మాతృత్వం” అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. మాతృత్వానికి సంబంధించిన శాశ్వత లక్షణాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. అవి కాలంతో పాటు మారవు. ఆ శాశ్వత లక్షణాల కారణంగానే, ఒక యుగంలో మార్పును తీసుకువచ్చే వ్యక్తులు ఉద్భవిస్తారు” అని వివరించారు.
సృష్టి వృద్ధికి, పోషణకు, కొనసాగింపునకు మాతృత్వమే మూలాధారం అని చెబుతూ మానవుని గొప్ప శక్తి అతని ఆలోచన అని, కానీ ఆ ఆలోచనకు సరైన దిశను నిర్దేశించేది మాత్రం తల్లే అని తెలిపారు. తల్లి మానవునికి మొదటి గురువు, జీవితాంతం భావోద్వేగ మద్దతుకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. నేటి కాలంలో కుటుంబాలలో సమయం కేటాయించడం, నిరంతరం సంభాషణలు కొనసాగించడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
 
పిల్లల కుతూహలానికి లేదా ప్రశ్నలకు స్పందించి వాటిని పరిష్కరించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొంటూ ఇందుకోసం వారు తమ జ్ఞానాన్ని నిరంతరం విస్తరించుకోవడం చాలా ముఖ్యం అని డా. భగవత్ తెలిపారు. పిల్లలు ఉపదేశాల కంటే అనుకరణ ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారని, కాబట్టి తల్లిదండ్రులు స్వయంగా ఆదర్శవంతమైన ప్రవర్తనను ప్రదర్శించాలని ఆయన సూచించారు. 
 
సమాజంలో అనేక చర్చలు గందరగోళం వల్ల తలెత్తుతాయని, కొన్నిసార్లు ఆ గందరగోళాన్ని ఉద్దేశపూర్వకంగానే సృష్టిస్తారని ఆయన హెచ్చరించారు. చాలా కాలం పాటు భారతీయ సంస్కృతి గురించి తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేశారని, మన సంప్రదాయాలు తప్పని చెప్పారని, కానీ వాస్తవానికి మన సాంస్కృతిక పునాదులు అత్యంత దృఢమైనవి, స్పష్టమైనవి అని స్పష్టం చేశారు. 
 
మన చరిత్ర, జ్ఞానం, సంప్రదాయాలపై విశ్వాసంతో మనం ముందుకు సాగాలని డా. భగవత్ సూచించారు. ఐక్యతే పరమ సత్యమని, వైవిధ్యంలో ఏకత్వ భావన భారతీయ సంస్కృతి ప్రధాన సందేశమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో నివసిస్తున్నప్పుడు, ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి, జీవన విలువలకు అనుగుణంగా జీవించాలని ఆయన స్పష్టం చేశారు.
 
ఇతర దేశాల జీవనశైలిని ఆలోచనా రహితంగా అనుసరించడానికి బదులుగా, భారతీయ దృక్పథం ఆధారంగా మన సామాజిక, వ్యవస్థలను బలోపేతం చేయడం ప్రస్తుత తక్షణ అవసరం అని ఆయన పిలుపిచ్చారు.  మాతృత్వం అనే అంశంపై మాట్లాడటం తనకు ఒక రకంగా విరుద్ధమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
 
“ఒక కోణంలో చూస్తే, ఇది పూర్తిగా మహిళలకు సంబంధించిన అంశం. దీనిపై పురుషులు మాట్లాడటం అంత సముచితం కాకపోవచ్చు. ఈ విషయంపై విశ్వమాంగళ్య సభ ఇప్పటికే విస్తృత చర్చలు జరిపింది. మన దృక్పథం ఏమిటి? మన సంప్రదాయం ఏం చెబుతోంది? ప్రస్తుత కాలంలో మనం ఎలా వ్యవహరించాలి? అనే అంశాలపై పూర్వం నుండే లోతైన చింతన జరుగుతూనే ఉంది” అని డా. భగవత్ వివరించారు. 
 
ఈ అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగింది. “మాతృ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం” అనే నినాదంతో పనిచేసే అంతర్జాతీయ మహిళా సంస్థ ‘విశ్వమాంగళ్య సభ’ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశం కోసం ఈ జాతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఇది జూలై 23-24 తేదీలలో ‘విశ్వ యువక కేంద్రం’లో ముగిసింది. 
 
రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 280 మంది మహిళలు పాల్గొన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, భారతీయ కుటుంబ వ్యవస్థ మరియు నేటి కాలంలో మాతృత్వ పాత్రపై విస్తృతమైన చర్చలు, సంవాదాలు జరిగాయి. ఈ అవగాహన సమావేశం ముగింపు కార్యక్రమంలో, వివిధ రంగాలలో సేవలందిస్తున్న 900 మందికి పైగా ప్రముఖ మహిళలు (మాతృశక్తి) పాల్గొన్నారు. 
 
2026లో, విశ్వమాంగళ్య సభ దేశవ్యాప్తంగా 23 ప్రాంతాలలో సమావేశాలను నిర్వహించింది. వీటిలో సుమారు 37,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో భారతీయ కుటుంబ వ్యవస్థ, మారుతున్న మాతృత్వ పాత్ర మరియు భావి తరాలకు విలువలతో కూడిన పెంపకం (సంస్కార నిర్మాణం) వంటి అంశాలపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ప్రస్తుతం, విశ్వమాంగళ్య సభ భారతదేశంలోని 33 ప్రాంతాలలో చురుకుగా పనిచేస్తోంది.
 
విద్య, సంస్కార నిర్మాణం, సామాజిక చైతన్యం, సేవా కార్యక్రమాల వంటి వివిధ రంగాలలో సుమారు 6 లక్షల మంది మహిళలు (మాతృశక్తి) ఈ సంస్థతో అనుసంధానమై పనిచేస్తున్నారు. భారతదేశం వెలుపల కూడా ఈ సంస్థ కార్యకలాపాలు అమెరికా, నెదర్లాండ్స్‌లతో సహా 14 దేశాలకు విస్తరించి ఉన్నాయి. కుటుంబం, సమాజం, దేశ నిర్మాణానికి పునాదిగా నిలిచే ‘మాతృత్వ శక్తి’కి ప్రతి మహిళ ఒక స్వరూపమని విశ్వమాంగళ్య సభ విశ్వసిస్తోంది.
 
మంచి సంస్కారాలు కలిగిన తరాలను తీర్చిదిద్దడం ద్వారా బలమైన, సామరస్యపూర్వకమైన మరియు ఆత్మవిశ్వాసం గల భారతావని నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించేలా మహిళల్లో మాతృత్వం పట్ల బాధ్యతా భావం, సాంస్కృతిక స్పృహ, నైతిక విలువలు, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడం ఈ సంస్థ లక్ష్యం.
 
పరమ పూజ్య ఆచార్య స్వామి శ్రీ జితేంద్రనాథ్ జీ మహారాజ్ మార్గదర్శకత్వంలో 2010 ఫిబ్రవరి 19న నాగ్‌పూర్‌లో ‘విశ్వమాంగళ్య సభ’ను స్థాపించారు.  ఆయన 600 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘శ్రీ దత్త పీఠ’ సంప్రదాయానికి 18వ పీఠాధీశ్వరుడు. సంస్కారం, సామర్థ్యం, సదాచారం, సేవ అనే నాలుగు సూత్రాల ఆధారంగా పనిచేస్తూ, దేశ నిర్మాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సంస్థ ‘మాతృశక్తి’ని సమీకరిస్తోంది.