దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో నిత్యం జరిగే కోర్టు విచారణల్ని ఎప్పుడైతే ప్రత్యక్ష ప్రసారం చేసే విధానం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి న్యాయమూర్తుల, కోర్టు విచారణల వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో పెరిగాయి. వీటిని అడ్డంపెట్టుకుని మార్ఫింగ్ లు చేసి మరీ సంపాదించే వారు కూడా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా వీటిపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో సంబంధిత కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోర్టు కార్యకలాపాల ఆడియో-వీడియో రికార్డింగ్‌లను పోస్ట్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది.
దాని ప్రకారం సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ లేదా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా న్యాయ కార్యకలాపాల ఆడియో/వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సేకరించడం, సవరించడం, వైరల్ చేయడం, పోస్ట్ చేయడం, రీ-పోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం లేదా వాటి ద్వారా డబ్బు సంపాదించడం వంటివి చేయడంపై నిషేధం విధించారు.
“తాత్కాలిక చర్యగా, ఈ న్యాయస్థానం సెక్రటరీ జనరల్ లేదా సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా, న్యాయపరమైన విచారణల ఆడియో-వీడియో రికార్డింగ్‌లను సేకరించడం, సవరించడం, ప్రచారం చేయడం… అలాగే సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ వేదికలపై పోస్ట్ చేయడం, రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం వంటివి చేయకూడదని ఆదేశించడమైనది,” అని ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు వార్తల పోస్టింగ్స్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రభావం చూపదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మీడియా సంస్థలకు కాస్త ఊరట దక్కినట్లయింది. అయితే మిగతా వాళ్లు మాత్రం కోర్టు కార్యకలాపాలను, విచారణలను ఇకపై పోస్టింగ్ చేసేటప్పుడు సంబంధిత హైకోర్టుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సుప్రీంకోర్టుకు ఈ విషయంలో చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.

More Stories
480 పాకిస్థాన్ సోషల్ మీడియా ఖాతాల నిలిపివేత
ఇస్రోలో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు, నిహంగ్ సిక్కుల మధ్య ఘర్షణ