లీకేజీకి పాల్ప‌డితే 10 ఏళ్ల జైలు, రూ. రూ. 10 కోట్ల వరకు జరిమానా

లీకేజీకి పాల్ప‌డితే 10 ఏళ్ల జైలు, రూ. రూ. 10 కోట్ల వరకు జరిమానా

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విద్యా రంగ పరీక్షల పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను వేగవంతం చేసింది. ఈ సున్నిత సమస్యను పరిష్కరించేందుకు రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపేలా కఠినమైన చట్టాలను తీసుకువస్తూనే, మరోవైపు వీధుల్లో ఆందోళనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చల ప్రక్రియను ప్రారంభించింది.

ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు సవరణలకు కీలక ఆమోదం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్ లో వరుస సమావేశాలు జరిగాయి. భద్రతా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అనంతరం కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం ప్రకారం, వ్యక్తిగతంగా ప్రశ్నపత్రాల లీక్‌కు పాల్పడిన వారిపై 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే వ్యవస్థీకృతంగా జరిగే నేరాల విషయంలో 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. 

అయితే, ఇటీవల చోటుచేసుకున్న పలు ప్రవేశ పరీక్షల లీక్ ఘటనల నేపథ్యంలో ఈ శిక్షలు సరిపోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో జైలు శిక్షల కాలాన్ని పెంచడం, జరిమానాల మొత్తాన్ని భారీగా పెంచుతూ నిబంధనలను కఠినతరం చేశారు. ఈ చట్టంలో అనేక సవరణలు చేస్తూ  సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఆమోదముద్ర వేసింది. 

పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలలో ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. దీనికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు చేపట్టింది కూడా. ప్రతిపాదిత నూతన నిబంధనలు, సవరణల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడే నేరగాళ్లపై తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. ఈ కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వీటికి పూర్తి చట్టపరమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు, మూడు నెలల పరిమిత వ్యవధిలోనే దర్యాప్తు పూర్తి చేసి త్వరితగతిన తీర్పులను వెలువరించేలా ప్రత్యేక అధికారాలను కల్పిస్తారు. ఇటువంటి తీవ్రమైన అక్రమాలకు పాల్పడే నిందితులకు గరిష్ఠంగా పదేళ్ల కఠిన జైలు శిక్ష పడుతంది. దీంతో పాటు 10 కోట్ల రూపాయల వరకు భారీ జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటన్నింటినీ కూడా కేంద్ర కేబినెట్ యధాతథంగా ఆమోదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.