హైదరాబాద్ లో బిజెపి విజయాన్ని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ కుట్రలు 

హైదరాబాద్ లో బిజెపి విజయాన్ని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ కుట్రలు 
హైదరాబాద్ నగరంలో బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని పెంచి, 300 వార్డులు చేసి, ఎక్కడ బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందోనని భయపడి హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారని విమర్శించారు. 
 
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటూ  మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రాంతాలను విడదీసి, కేవలం మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ లబ్ధి పొందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యూహం పన్నారని, హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీకి బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్‌లలో ఎన్నికలు వస్తే ప్రజలు బీజేపీని ఆదరిస్తారని, మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. 
 
‘హైడ్రా’  పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ మొదట గడ్డపార పట్టిందే పేదల మీద అని మండిపడ్డారు. ఫాతిమా కాలేజీ లాంటి పెద్ద సంస్థలను వదిలేసి, పేద వారి ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ భూములను రియల్ ఎస్టేట్ లాండ్‌గా మార్చుకోవడానికి, కేవలం రియల్ ఎస్టేట్ ద్వారా లబ్ధి పొందడానికే ఈ ‘హైడ్రా’ విధానాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు.  ‘హైడ్రా’ వల్ల చివరకు హైదరాబాద్‌లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కాలం ముగిసి, వర్షాకాలం వచ్చినా హైదరాబాద్ నగరంలో ప్రజలకు కనీసం తాగునీరు అందడం లేదని ధ్వజమెత్తారు.

 తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దోపిడీ పాలనను చూసి విసిగిపోయిందని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తోందని తెలిపారు. ప్రస్తుత సర్వేలన్నీ బీజేపీ ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేస్తుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో వణుకు మొదలైందని స్పష్టం చేశారు.  ప్రజలు బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాబట్టి కార్యకర్తలు, నాయకులు మరింత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.

డివిజన్ల వారీగా స్థానిక ప్రజా సమస్యలపై, రోడ్ల దుస్థితిపై, అధికార యంత్రాంగం, ప్రభుత్వ వైఫల్యాలపై రోడ్ల మీదకు వచ్చి ఉధృత పోరాటాలు చేయాలని జిల్లా అధ్యక్షుడిని, శ్రేణులను కోరారు.  నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఎంతమాత్రం లేదని  రాoచందర్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సభ పూర్తిగా ఫ్లాప్ అయిందని, అందులో అంతా వృద్ధులే కనిపించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారు గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పారని, 10 ఏళ్ల పాలనలో గ్రూప్-1 లాంటి కీలక పరీక్షల పేపర్లను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.